నగరంలో స్ట్రీట్‌ ఫైట్‌

23 Oct, 2017 03:01 IST|Sakshi

బైక్‌ రేసింగ్‌ డబ్బుల కోసమేనని పోలీసుల అనుమానం

సాక్షి, హైదరాబాద్‌: రెండు గ్యాంగుల మధ్య హైదరాబాద్‌ నడిబొడ్డున శనివారం అర్ధరాత్రి స్ట్రీట్‌ ఫైట్‌ జరిగింది. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ గొడవ జరగడం విశేషం. కాచిగూడకు చెందిన సంజయ్, కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు శనివారం రాత్రి పని నిమిత్తం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14కు వచ్చారు. అక్కడే ఉన్న రామ్స్‌ దోస హౌస్‌లో టిఫిన్‌ చేసేందుకు సిద్ధమవుతుండగా పాతబస్తీకి చెందిన 20 మంది యువకులు బైక్‌లపై అక్కడికి వచ్చారు. వచ్చి రావడంతోనే ఆగ్రహంతో ఊగిపోతూ దోస తింటున్న సంజయ్‌ను రోడ్డు మధ్యకు ఈడ్చుకెళ్లారు. పిడిగుద్దులతో బాదారు. సంజయ్‌ స్నేహితుడు ఎంత వారించినా వినిపించుకోలేదు.

ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకుని పారిపోతుండగా ఛేజ్‌ చేసి మళ్లీ పట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య గంట పాటు గొడవ జరిగింది. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మెహిదీపట్నం, పాతబస్తీ నుంచి వచ్చిన విద్యార్థులు తనపై దాడి చేశారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారాంతపు సెలవు దినం కావడంతో శనివారం రాత్రి బైక్‌ రేసింగ్‌లకు పాల్పడి డబ్బుల కోసం దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు