స్కాలర్‌షిప్పులు కాజేసిన వారిఅరెస్ట్‌

2 Jun, 2018 12:10 IST|Sakshi
విద్యార్థుల సొమ్మును స్వాహా చేసిన ప్రభాకర్, శ్రీహరి  

ఖమ్మంక్రైం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్, మెస్‌ చార్జీలను బొక్కిన అవినీతి తిమింగలాలను ఏసీబీ శుక్రవారం అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపింది. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా సొమ్మును 2014 నుంచి ఇలా ఈ తిమింగలాలు గుట్కాయ స్వాహా చేశాయి. 

కళాశాలలో కేర్‌ టేకర్లుగా వ్యవహరిస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు ఎ.ప్రభాకర్, బి.శ్రీహరి.. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వస్తున్న స్కాలర్‌షిప్‌లపై కన్నేశారు. ఎలాగైనా వీటిని కాజేయాలని పథకం పన్నారు. వాటిని ఎవరికీ తెలియకుండా డ్రా చేయసాగారు. విద్యార్థులు అడిగితే.. ‘‘స్కాలర్‌షిప్‌లను, మెస్‌ చార్జీలను ప్రభుత్వం సరిగా విడుదల చేయడం లేదు’’ అని మభ్యపెడుతూ వచ్చారు. ఇలా మూడేళ్లు గడిచాయి.

ఒక ఏడాదంటే రాకపోవచు. వరుసగా మూడేళ్లపాటు ఎందుకు రావడం లేదన్న సందేహం అక్కడి విద్యార్థులకు వచ్చింది. దీనిపై వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఖమ్మం ఏసీబీని రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశించారు. ఏసీబీ సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేశారు.

ఈ ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు కలిసి విద్యార్థులకు దక్కాల్సిన అక్షరాలా 2,13, 55,443 రూపాయలను గుట్కాయ స్వాహా చేసినట్టుగా ఏసీబీ తేల్చింది. వారిద్దరిని అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్‌ జడ్జి ముందు హాజరుపరిచింది. ఆయన వీరిని జైలుకు పంపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు