తోటి లాయర్లే బెదిరిస్తున్నారు

12 Apr, 2018 17:17 IST|Sakshi

శ్రీనగర్‌ :  బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్‌ దీపికా సింగ్‌ రాజవత్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం చేసిన కతువా గ్యాంగ్‌ రేప్‌, హత్య కేసులో బాధితుల తరపున ఆమె వాదిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ కతువా జిల్లాలో నోమాడియక్‌ బకెర్‌వాల్‌ తెగకు చెందిన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల సాంజి రామ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక సంచలన వాఖ్యలు చేశారు.

‘ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది. జమ్మూ బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బీఎస్‌ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించార’ని దీపిక వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు