పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందుతాగిన మహిళ

25 Jul, 2018 14:44 IST|Sakshi
చికిత్స పొందుతున్న సునీత 

మిర్యాలగూడ అర్బన్‌ : పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. బాధిరాలు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన బట్టు రవి అతడి భార్య సునీత పట్టణంలోని ఈదులగూడ వద్ద వినాయక విగ్రహాలు తయారు చేయడానికి రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన సోనుతో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు.

విగ్రహాల తయారికి సుమారు రూ.4 లక్షలకుపైగా ఖర్చు పెట్టారు. విగ్రహాలు పూర్తికావచ్చిన తరుణంలో పట్టణానికి చెందిన ప్రసాద్‌ రెండు నెలలుగా విగ్రహాల తయారికి పెట్టిన పెట్టుబడిని మీకు వడ్డీతో ఇస్తానని ఆ మెత్తం విగ్రహాలను వదిలి వెళ్లాలని రవిని వేధించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు సైతం జరిగాయి.

దీంతో ప్రసాద్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ప్రసాద్‌ వేధిస్తుండడంతో.. రవి విగ్రహాల తయారీ వద్దకు రావడంలేదు. భయాందోళనకు గురైన రవి భార్య సునీత పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టమని లేకుంటే విగ్రహాల తయారీకి పెట్టిన పెట్టుబడిరాకుంటే అప్పుల పాలవుతామని చెప్పడంతో తిరిగి సోమవారం రవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అయినా పోలీసులు ప్రసాద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన సునీత మంగళవారం సాయంత్రం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయమై వన్‌టౌన్‌ సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా ఇరువురు పడిన గొడవలో గతంలో కేసు పెట్టామని, ప్రసాద్‌ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదని పేర్కొన్నాడు.  

మరిన్ని వార్తలు