స్నేహితురాలు మాట్లాడటం లేదని యువతి ఆత్మహత్య

20 May, 2019 08:41 IST|Sakshi
శ్రీదేవి మృతదేహం

ఫలితమివ్వని  పోలీసుల కౌన్సెలింగ్‌  

హిమాయత్‌నగర్‌: వారిద్దరూ అమ్మాయిలే.. స్నేహంగా ఉంటున్నారు...అన్ని విషయాలూ షేర్‌ చేసుకునేవారు.. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్దలు వచ్చాయి.. అయితే నువ్వు మాట్లాడకపోతే నేనుండలేనంటూ వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ గౌడ్‌ తెలిపిన మేరకు.. ఫిలింనగర్‌కు చెందిన శ్రీదేవి(22) హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో నివాసం ఉంటూ రిషి డిగ్రీ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నమ్రత  కూడా ఇదే హాస్టల్‌లో ఉంటూ, అదే కాలేజీలో చదువుతుంది. వీరిద్దరూ అతి తక్కువ కాలంలో స్నేహితులయ్యారు.

అన్ని విషయాలు ఒకరికొకరు చర్చించుకునే వారు. ఈ క్రమంలో ఏమైందో ఇద్దరి మధ్యా మనస్పర్దలు వచ్చాయి. మూడు వారాల క్రితం నమ్రత తన స్వస్థలానికి వెళ్లింది. శ్రీదేవి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా నమ్రత స్పందించలేదు. శనివారం పరీక్ష రాసేందుకు నమ్రత నగరానికి వచ్చింది. హైదర్‌గూడలోని ఓ పరీక్షా సెంటర్‌లో ఇద్దరూ పరీక్ష రాశారు. పరీక్ష అనంతరం నమ్రతను శ్రీదేవి హాస్టల్‌కు తీసికెళ్లింది. గదికి గడియ పెట్టి ‘ఇకపై నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు. నేను చెప్పినట్లు వినాలి. నువ్వు లేకపోతే నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను..మనిద్దరం కలిసి ఉందాం’ అంటూ చెప్పడంతో నమ్రత ఒప్పుకోలేదు. నేను మా ఊరికి వెళ్లిపోయాను ఇంకా నీతో మాట్లాడటం కుదరదు అని తేల్చి చెప్పింది. అయినా శ్రీదేవి వినకపోవడంతో అదేరోజు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కౌన్సిలింగ్‌ అనంతరం ఆత్మహత్య...
ఇద్దరి తల్లిదండ్రుల సమక్షంలో ఇన్‌స్పెక్టర్‌ పాలేపల్లి రమేష్‌కుమార్, ఎస్‌.ఐ.వినోద్‌కుమార్‌గౌడ్, అడ్మిన్‌ ఎస్‌.ఐ.కర్ణాకర్‌రెడ్డిలు సుమారు 4గంటల పాటు శ్రీదేవికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తరువాత హాస్టల్‌కు వెళ్లిన శ్రీదేవిఎవరూ లేని సమయంలో ‘సూపర్‌ వాస్మోల్‌’ కొబ్బరి నూనె తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుదేహాన్ని గాంధీకి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు