కటకటాల్లోకి 14 మంది..

2 Sep, 2016 23:20 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రమణారెడ్డి
  • ‘మెడికల్‌ అన్‌ఫిట్‌’ కేసులో అరెస్టు
  • రూ.12.70 లక్షలు నగదు, సొత్తు రికవరీ
  • బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి
  • బెల్లంపల్లి : మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తామని సింగరేణి కార్మికులను మోసం చేసిన కేసులో 14 మంది నిందితులను బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక వన్‌టౌన్‌లో శుక్రవారం డీఎస్పీ ఎ.రమణారెడ్డి వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి అశోక్‌నగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డు క్లర్క్‌ మహ్మద్‌ అబ్దుల్‌ సలీం 2013 నుంచి మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయిస్తానంటూ కొంతమందిని ఏర్పాటు చేసుకుని వసూళ్లకు పాల్పడ్డాడు. గత నెల 19న అతడిపై పోలీసు కేసు నమోదు కావడంతో 23వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. సలీంతోపాటు కొంతమంది కలిసి బెల్లంపల్లి, మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, శ్రీరాంపూర్, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన 33 మంది కార్మికుల నుంచి రూ.2.23 కోట్లు వసూలు చేశారు.
     
    ఒక్కొక్కరి వద్ద రూ.5లక్షల నుంచి రూ.17 లక్షల వరకు వసూలు చేశారు. వీరిపై ఆయా స్టేషన్లలో ఏడు కేసులు నమోదయ్యాయి. మెుత్తంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ దందాలో 34 మంది భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ వివరించారు. ఈ వ్యవహారంలో గోమాస రాజం(బెల్లంపల్లి), ఎడ్ల రాజిరెడ్డి(బీజోన్‌–రామకృష్ణాపూర్‌), అప్పాల రాజమౌళి(తిలక్‌నగర్‌–గోదావరిఖని), ఉండేటి ప్రశాంత్‌కుమార్‌(కొత్తగూడెం), ఏలూరి వెంకటనిర్మలకుమార్‌(కొత్తగూడెం), కొత్త వెంకటయ్య(కొత్తగూడెం), మురాల హర్షవర్థన్‌రావు(కొత్తగూడెం), ఎం.ఎ.అజయ్‌కుమార్, ఎం.ఎ.విజయ్‌కుమార్, మాదరి స్వామి(బెల్లంపల్లి), ఎడ్ల భీమయ్య(రామకృష్ణాపూర్‌), ఒజ్జ కొమురయ్య(గోదావరిఖని), డొంగరి రాజం(బెల్లంపల్లి), తొగరి నర్సయ్య(రొంపికుంట–కరీంనగర్‌)లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరిలో కొత్త వెంకటయ్య సింగరేణి కొత్తగూడెం మెయిన్‌ ఏరియా ఆస్పత్రిలో హౌజ్‌ సర్జన్, మురాల హర్షవర్థన్‌రావు మెయిన్‌ ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.
     
    నిందితుల నుంచి నగదు రూ.12.70 లక్షలు, పదమూడున్నర తులాల బంగారం, ఏడున్నర తులాల వెండి ఆభరణాలు, ఇండికా విస్ట్రా కారు, సింగరేణి లెటర్‌ ప్యాడ్‌సెట్, బాండ్‌పేపర్, రెండు ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎల్‌.రఘు, ఏఎస్సై రమేశ్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు తిరుపతి, ఎం.లక్ష్మణ్, శ్రీనివాస్, హోంగార్డు హాజీ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు