రెండు రోజుల్లోరూ.22,500 కోట్లు

10 Nov, 2016 00:16 IST|Sakshi
రెండు రోజుల్లోరూ.22,500 కోట్లు
రద్దయిన నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్లు 
రాజమహేంద్రవరంలో నేటి నుంచి మార్పిడికి ఆర్‌బీఐ సన్నాహాలు
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు
ఇప్పటికే బ్యాంకులకు చేరినరూ.7,500 కోట్ల కొత్త నోట్లు
నేడు రానున్న మరో రూ.15,000 కోట్లు
శని, ఆదివారాల్లోనూ పని చేయనున్న బ్యాంకులు
సాక్షి, రాజమహేంద్రవరం : రద్దయిన రూ.వెయ్యి, రూ.ఐదువందల నోట్ల స్థానం లో కొత్తగా ముద్రించిన రూ.500, రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అవకాశం కల్పిస్తోంది. రాజమహేంద్రవరంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రద్దయిన నోట్లను రూ.22,500 కోట్ల మేర కు కొత్త నోట్లుగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. గురువారం నుంచే ఇలా మార్చుకోవచ్చు. బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే నగరంలోని ఆయా బ్యాంకులకు   రూ.7,500 కోట్లను చేరవేసింది. గురువారం రెండు దఫాలుగా మరో రూ.15,000 కోట్లను చేరవేయనుంది. నోట్లను  మార్పిడి చేసేందుకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తమ వద్ద రద్దయిన నోట్లున్న వారు రేషన్‌  కార్డు, ఆధార్‌ కార్డు లేదా ఏదో ఒక గుర్తింపు కార్డును చూపి రద్దయిన నోట్లను మార్చుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థం  శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పని చేయనున్నాయి. ఎలాంటి రుసుమూ లేకుండా ప్రజలు తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవచ్చని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.10 వేల వరకు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంది. మిగతా మొత్తాన్ని వారివారి ఖాతాల్లో జమ చేస్తారు. కౌంటర్ల వద్ద కాకుండా ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసుకోవడం ఉత్తమమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక కౌంటర్ల వివరాలు తెలుపుతూ బ్యాంకుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల  స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్ల మార్పిడికి జరుగుతున్న సన్నాహాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం దైనందిన అవసరాలకు కూడా కొనుగోళ్లు చేయలేక జనం పడుతున్న అవస్థలను సత్వరం తొలగించేందుకూ ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు