ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యం తగదు

5 Dec, 2016 22:40 IST|Sakshi
ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యం తగదు
9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వేణు
గొర్రిపూడి(కరప) :  పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, జెడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ విమర్శించారు. మండలంలోని గొర్రిపూడిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలకోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు అన్ని కలెక్టరేట్ల వద్ద ఈనెల 9న ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ల వద్దకు తరలివచ్చి, ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పెద్దనోట్లు రద్దు చేసిందని, గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. నల్లధనం బయట పెట్టటానికే పెద్దనోట్లు రద్దుచేశామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకుంటున్నారేకానీ దానివల్ల మధ్యతరగతి ప్రజలకే ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతుండటం వల్ల గ్రామాల్లో కూలీలకు పనులు ఉండటంలేదని, రైతులు పొలాల్లో పనులు చేయించుకోలేక పోతున్నారన్నారు. పుట్టలో ఉన్న పామును పట్టుకోవాలేకానీ, పాముకోసం పుట్టనే తగలపెట్టడం భావ్యంకాదన్నారు. నల్లకుబేరుల జాబితా ఉన్నప్పుడు వాళ్లను పట్టుకోవాలేకానీ, ప్రజలందరినీ వేధించడం తగదన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలో వల్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు.
మరిన్ని వార్తలు