పోలీసుల త్యాగాలకు విలువ కట్టలేం

22 Oct, 2016 02:00 IST|Sakshi
పోలీసుల త్యాగాలకు విలువ కట్టలేం
ఏలూరు అర్బన్‌ :  నేటి సమాజ శాంతి సౌభాగ్యాలు నాటి పోలీసు అమరవీరుల త్యాగ ఫలమేనని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీసు అంటేనే ఒక ధైర్యమని, కంటిమీద కునుకు లేకుండా శాంతిభద్రతల రక్షణకు పాటు పడే మహావీరులు వారు అని కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు ఎప్పటికపుడు అందించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ పోలీసులకు ఎవరిమీదా పగ ఉండదని, సంఘ విద్రోహశక్తులపైనే పీచమణచడంపైనే వారి దృష్టి ఉంటుందని అన్నారు. పోలీసు క్వార్టర్లలో పోలీసు కుటుంబాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ పోలీసులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ మాట్లాడుతూ జన్మభూమిని రక్షించుకోవడంలో అనేక మంది జవానులు వీరమరణం పొందారని, వారు చేసిన ప్రాణత్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఈ సంవత్సరం 473 మంది పోలీసులు దేశంకోసం ప్రాణాలు అర్పించారని, వారందరికీ శతకోటి వందనాలు అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, కార్టూన్, పెయింటింగ్‌ వంటి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ఆర్‌ఆర్‌పేట మీదుగా ఫైర్‌స్టేçÙన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు