గుంటూరులో హత్య.. కోటప్పకొండలో దహనం

1 Apr, 2016 20:56 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఓ వ్యక్తిని హతమార్చి.. దాన్ని ఏమార్చాలని చూసి అడ్డంగా దొరికిపోయారు.. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గుంటూరు నగరానికి చెందిన మినుముల వ్యాపారి కొప్పురావూరి శంకరరావుకు పొన్నూరుకు చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావుకు ఆర్థిక వివాదాలున్నాయి. గతంలో శంకరరావు వద్ద గుమస్తాగా పనిచేసిన శ్రీనివాసరావు అక్రమంగా రూ.2 కోట్ల వరకు డబ్బులు వాడుకున్నాడు. ఈ మేరకు శంకరరావు 2014లో అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించాలంటూ శంకరరావు కుమారుడు సందీప్ పలుమార్లు శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది.

దీంతో గురువారం అర్ధరాత్రి శంకరరావు తనయుడు సందీప్‌తోపాటు మరికొందరు శ్రీనివాసరావును గుంటూరులో హతమార్చి గోనెసంచిలో మృతదేహాన్ని కారులో ఎక్కిస్తుండగా స్థానికులు కొందరు చూసి డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహాన్ని వారు నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని పెట్లూరివారిపాలెం వద్దకు తరలించి పెట్రోలు పోసి దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితులుగా అనుమానిస్తున్న శంకరరావు, సందీప్‌లతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, శ్రీనివాసరావు గత 20 రోజులుగా కనిపించడం లేదని ఆయన సోదరుడు సుబ్బారావు పోలీసులకు తెలిపాడు. అయితే హత్యకు ఆర్థికపరమైన వ్యవహారమే కాకుండా బలమైన కారణం ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు