ద్వంద్వ నీతి

1 Nov, 2016 23:38 IST|Sakshi
ద్వంద్వ నీతి

అధికారులపై చర్యలకు తాత్సారం
 నోటీసులు, చార్జెస్ పేరుతో దాటవేత
 విమర్శలకు దారి తీస్తున్న అధికారుల తీరు
 
 సాక్షి, నిజామాబాద్ :‘ఉపాధి’ అక్రమాలపై చర్యల విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిపై వేటు వేస్తున్న అధికారులు.. రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడిన రెగ్యులర్ అధికారులపై చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 మంది ఎంపీడీవోలు రూ.లక్షల్లో ఉపాధి హామీ నిధులు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో తేలింది. అలాగే 20 మంది పంచాయతీరాజ్ ఏఈలు సైతం భారీ ఎత్తున దిగమింగినట్లు ప్రాథమికంగా వెలుగుచూసింది. మరో తొమ్మిది మంది నీటి పారుదల శాఖ ఏఈల అక్రమాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా గ్రామ స్థాయిలో పనిచేసే 96 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన అధికారులు, ఒక్క ఎంపీడీవోపైన గానీ, ఏఈలపైన గానీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేకపోవడం గమనార్హం. నోటీసుల పేరుతో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుండటంతో విమర్శలు వస్తున్నాయి.
 
 గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీల వలసలను నివారించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఇందుకోసం ఏటా రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోంది. భారీ వ్యయంతో చేపట్టిన పనుల తీరుపై సామాజిక తనిఖీలు చేపడుతోంది. పనుల నాణ్యత, అవకతవకలు, పనుల పురోగతి వంటివి క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు ఆయా మండలాల్లో ప్రజావేదికను ఏర్పాటు చేసి, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పది విడతల్లో సామాజిక తనిఖీలు జరిగాయి. సుమారు 314 ప్రజావేదికలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన పనులు, కూలీలకు అందిన డబ్బులు, మెటీరియల్ కాంపోనెంట్, ఇలా వివిధ అంశాలపై ఈ వేదికపై పరిశీలిస్తారు.
 
  సామాజిక తనిఖీల్లో భారీగా అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.4.20 కోట్ల ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అయినట్లు తనిఖీల్లో తేలింది. ఈ మొత్తాన్ని రికవరీ చేయడంలో సంబంధిత అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.1.87 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగారు. అంటే పక్కదారి పట్టిన సొమ్ములో కనీసం 50 శాతం కూడా రికవరీ కాలేదు. మిగిలిన రూ.2.33 కోట్లు పక్కదారి పట్టిన సోమ్మును అక్రమార్కుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ అక్రమాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1,297 మందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో 96 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. అలాగే 26 మంది టెక్నికల్ అసిస్టెంట్లను, ఐదుగురు ఏపీఓలపై సస్పెన్షన్ వేటు వేశారు. 1,163 మేట్లు, ఇతర గ్రామీణ స్థాయిలో పనిచేసే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న అధికారులు, ఒక్క రెగ్యులర్ అధికారిపై కూడా చర్యలు లేకపోవడం గమనార్హం. నోటీసులు, ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఇలా జాప్యం జరుగుతుండటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు