ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు

26 May, 2017 18:55 IST|Sakshi
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు
ఏలూరు అర్బన్‌ : ట్రాఫిక్‌ భద్రతపై ప్రతివారూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘​డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రజలతో ఫోన్‌లో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దానికి ప్రతిగా ప్రజల ఇబ్బందులకు సంబంధించి సంబంధిత అధికారులకు ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలువురు ఎస్పీకి విన్నవించుకున్న సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి. వీరవాసరం నుంచి ఫోన్‌ చేసిన వ్యక్తి గ్రామంలో రౌడీషీటర్‌ ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కొయ్యలగూడెం నుంచి ఫోన్‌ చేసిన వ్యక్తి గ్రామంలో అనధికారికంగా చిట్స్‌ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఏలూరు నుంచి మాట్లాడిన వ్యక్తి ప్రార్థనాలయాల వద్ద ఆదివారం లౌడ్‌ స్పీకర్‌లు పెద్ద శబ్దంతో పెడుతున్నారని వారిని నియంత్రించాలని విన్నవించాడు. 
 
మరిన్ని వార్తలు