కందికి ప్రమాదం

23 Oct, 2016 22:50 IST|Sakshi
కందికి ప్రమాదం

– సస్యరక్షణ చర్యలతో నివారణ
–  కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌ సూచన


అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా 68 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కంది పంటకు శనగపచ్చపురుగుతో పాటు మారుకామచ్చల పురుగు (కాయతొలిచే పురుగు) ఆశించినందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని  కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు.

మారుకామచ్చల పురుగు
ఈ పురుగును వాడుకలో పూత లేదా గూడ పురుగు లేదా బూజు పురుగుగా పిలుస్తుంటారు. సరైన సమయంలో నివారించకపోతే కంది పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పిల్ల పురుగులు పువ్వుమొగ్గలోని లేత భాగాలను తింటాయి. తర్వాత ఆకులు, పూత, పిందెలు, కాయలను కలిపి గూడుగా చేసుకుని లోపలే ఉండి తినడం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసుకుని గింజలను తింటాయి. కాయలోపల ఉండటం వల్ల నిర్మూలన మందుల ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ. ఈ పురుగు కందితో పాటు పెసర, మినుము, చిక్కుడు, వేరుశనగ, జనుము, జీలుగ వంటి పైర్లను కూడా ఆశించిస్తుంది.

జీవితచక్రం
మారుకా తల్లి రెక్కల పురుగు చిన్నదిగా ముందు రెక్కలు ముదురు గోధుమ రంగులోనూ, వెనుక రెక్కలు తెల్లగా ఉంటాయి. ముందు రెక్కలపై తెల్లటి గద ఆకారపు మచ్చలు ఉంటాయి. పగటి వేళ పంటలో మొక్కలను కదిలిస్తే రెక్కల పురుగులు ఎగరడం గమనించవచ్చు. విశ్రాంతి సమయంలో ఆకుల అడుగు భాగాన ఏటవాలుగా వేళాడుతూ కనబడుతాయి. రెక్కల పురుగులు పూమొగ్గలు, లేత ఆకులు, పిందెలపై ఒక్కొక్కటి 2 నుంచి 16 గుడ్లను పెడుతుంది. ఐదు నుంచి ఆరు రోజుల్లో 150 నుంచి 200 గ్రుడ్లను పెడుతుంది. తెల్లగా, చిన్నగా ఉండటం వల్ల గుడ్లను గుర్తించడం కష్టం. గుడ్ల నుంచి నాలుగైదు రోజుల్లో తెల్ల రంగులో పిల్లలు బయటకు వచ్చి నాలుగైదు రోజుల్లోనే శరీరంపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి.

సస్యరక్షణ
పొలంచుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పైరు పూత దశకు రాకమునుపే 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వల్ల రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.  పూత దశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉనికిని గమనించాలి. ఉన్నట్లు కనిపిస్తే 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్‌ లేదా 1 గ్రాము ధయోడికార్బ్‌ లేదా 1.5 గ్రాములు అసిఫేట్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. గూళ్లు కట్టినట్లు గమనిస్తే 1.5 గ్రాములు అసిఫేట్‌ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్‌ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్‌ లేదా 1 మిల్లీలీటర్ల నొవాల్యురాన్, 1 మి.లీ ల్యాంబ్డాసైహలోత్రిన్‌ లేదా 0.3 మి.లీ ఫ్లూబెండమైడ్‌ వీటిలో ఏదో ఒక మందుకు ఊదర స్వభావం కలిగిన 1 మి.లీ డైక్లోరోవాస్‌ మందును ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. అవసరమైతే మందులను మార్చి రెండు మూడు సార్లు పూత, కాయ దశలో పిచికారి చేసుకుంటే ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు