కట్టలు తెగిన ఆగ్రహం

13 Dec, 2016 22:19 IST|Sakshi
కట్టలు తెగిన ఆగ్రహం
- ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచ్‌ మేనేజర్‌పై ఉద్యోగుల దాడి
- మూడు రోజుల సెలవుల తర్వాత కూడా నో క్యాష్‌ బోర్డు 
- మేనేజర్‌తో సహా సిబ్బందిని బయటికి లాగి బ్యాంక్‌ మూత
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
కర్నూలు (అగ్రికల్చర్‌): వరుసగా మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకున్నా నగదు లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఖాతాల్లో డబ్బులున్నా చేతికందని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళవారం ఉదయం నగదు విత్‌డ్రాకు అధిక సంఖ్యలో ఉద్యోగులు కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచ్‌కు తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే బ్యాంకు ఎదుట బారులుదీరారు. కాగా బ్యాంక్‌ తెరిచిన వెంటనే నో క్యాష్‌ అంటూ బోర్డు పెట్టడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎస్‌బీఐ చెస్ట్‌ నుంచి రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో వెనుక్కు వచ్చానని బ్యాంక్‌ మేనేజర్‌ కళ్యాణ్‌ కుమార్‌ చెబుతున్నా సహనం నశించిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యోగులు దాడికి యత్నించడంతో మేనేజర్‌ పరుగులు తీశారు. అయినా ఉద్యోగులు వదలలేదు.బ్యాంకులోకి మూకుమ్మడిగా ప్రవేశించి మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. మేనేజర్‌తో సహా బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్దారు. మేనేజర్‌ను చొక్కా పట్టుకొని లాగి చేయి చేసుకున్నారు.  అద్దాలను పగుల కొట్టారు. బ్యాంకు ఉద్యోగులను బయటికి లాగి బ్యాంకులో నగదు లేనపుడు తెరవడం ఎందుకు అంటూ బ్యాంకును మూసివేశారు. చివరికి పోలీసులు వచ్చిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. 
  
అన్నీ అనుమానాలే:
ఎస్‌బీఐ కరెన్సీ చెస్ట్‌కు మూడు రోజలు క్రితమే రూ.26 కోట్లు వచ్చాయి. అప్పటి నుంచి బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెలవుల తర్వాత బ్యాంకు తెరిచినా నో క్యాష్‌ బోర్డు పెట్టడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కరెన్సీ చెస్ట్‌కు వచ్చిన రూ.26 కోట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న ఉత్పన్నఽమవుతోంది. ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఎటీఎంతో పాటు మరో రెండు ఏటీఎంల్లోనే నగదు ఉంచారు. ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌లో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయలు వచ్చినా నో క్యాష్‌ బోర్డు పెట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
రూపాయి కూడా తీసుకోని ఉద్యోగులు 400 మంది:
ట్రెజరీ బ్రాంచ్‌లో 2500 మంది ఉద్యోగులకు ఖాతాలు ఉన్నాయి. నవంబరు నెల జీతాలు డిసెంబరు 1నే ఖాతాల్లో జమచేసినా ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. మొదటి రోజు ఉద్యోగులకు రూ.20వేల ప్రకారం పంపిణీ చేసినా మరుసటి రోజు నుంచి నగదు లభ్యతను బట్టి రూ.10వేల వరకు ఇస్తున్నారు. ఈనెల 13వ తేదీ నాటికి జీతంలో ఒక్క రూపాయి తీసుకోని వారు 400 మంది ఉన్నారు. వీరితో పాటు అనేక మంది బ్యాంకుకు భారీగా తరలివచ్చారు. అయితే నగదు లేదని బోర్డు పెట్టడంతో దాడికి కారణమైంది.
 
పూర్తి స్థాయి నగదు వచ్చే వరకు బ్యాంక్‌ మూత: కళ్యాణ్‌కుమార్‌ మేనేజర్‌
ఉద్యోగుల కోసం బ్యాంక్‌ సిబ్బంది శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఉన్నంతలో బ్యాంకు ఎక్కువ మొత్తం తెచ్చి పంపిణీ చేస్తున్నాం. నగదు లభ్యతను బట్టి ప్రతి రోజు ఉదయమే బోర్డు పెడుతున్నాం. బ్యాంకు ఉద్యోగుల పట్ల దౌర్జన్యానికి పాల్పడటం ఆందోళన కలిగించింది. బ్యాంకుకు పూర్తి స్థాయిలో నగదు వచ్చే వరకు బ్యాంకు తెరిచేది లేదు.  
మరిన్ని వార్తలు