భూములివ్వని రైతుల్లో గుబులు

25 Oct, 2015 12:52 IST|Sakshi
చంద్రశేఖర్

రాజధాని భూముల్లో పంట దగ్ధం ఘటనపై అనుమానాలు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు... ఏ రోజు కారోజు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. పది నెలల వ్యవధిలో జరిగిన పలు సంఘటనలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన చెరుకు తోట దగ్ధం టీడీపీ కార్యకర్తల దుందుడుకు చర్యగా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు, పాలకులు స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటున్నారు. భూములు ఇవ్వని రైతులు సాగులో ఉన్న పంటను కాపాడుకునే యత్నంలో ఉంటే, మిగిలిన రైతులు సాగును చేపట్టాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

భూములు ఇవ్వలేదన్న కక్షతోనే...
తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చిన చంద్రశేఖర్ చెరుకు పంట దగ్ధం వెనుక అధికార పార్టీ కార్యకర్తల హస్తం ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న చంద్రశేఖర్‌పై అక్కడి టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇంకా ఆ పరిసర గ్రామాల్లో 1,000 ఎకరాలకుపైగానే భూములను రైతులు ఇవ్వాల్సి ఉంది. ఆ రైతులంతా చంద్రశేఖర్, మరి కొందరి సూచనల మేరకు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీరిని భయపెట్టి దారికి తీసుకువచ్చేందుకు ఈ ప్రయత్నం జరిగినట్టుగా అక్కడి రైతులు చెబుతున్నారు.

ఈ విషయమై చంద్రశేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, భూ సమీకరణకు భూములు ఇవ్వలేదన్న కక్షతోనే తన చెరుకు పంటను దగ్ధం చేశారని, అధికారులు ఈ కేసు విచారణపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. డీఎస్పీ శనివారం పొలాన్ని పరిశీలించారని, ఎవరో సిగరెట్ వేయడం వలన ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు.

గతంలోనూ అనేకసార్లు...
గత డిసెంబర్‌లో రాజధాని నిర్మాణానికి భూములను భూ సమీకరణ విధానంలో తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. దీన్ని కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 28న రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఐదు గ్రామాల్లో 13 చోట్ల షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను తగులబెట్టారు. ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లోని పంట పొలాలపై తెగబడ్డారు.

రాయపూడి గ్రామస్థులు గోరగంటి శ్రీనివాసరావుకు చెందిన 1,500 వెదురు బొంగులు, షేక్ చినమీరాసాహెబ్‌కు చెందినవి 2,500, లింగాయిపాలెం గ్రామస్థుడు గుంటుపల్లి సాంబశివరావుకు చెందిన 310, మందడం గ్రామస్థులు ముప్పాళ్ల వెంకటేశ్వరరావుకు చెందిన 1,300, యర్రమనేని శ్రీనివాసరావుకు చెందిన 2,500 వెదురు బొంగులు, యంపరాల అప్పారావుకు చెందిన 500 మీటర్ల డ్రిప్‌వైరును దుండగులు తగులబెట్టారు.

వెంకటపాలెం గ్రామస్థుడు లంకా రఘునాథరావుకు చెందిన అరటి బొత్తలకు నిప్పు పెట్టారు. తాడేపల్లి మండలం పెనుమాక సర్పంచి కల్లం పానకాలరెడ్డికి చెందిన 2,500 బొంగులు, బోనం శంకరరెడ్డికి చెందిన డ్రిప్‌వైరు, పశువులపాకలను తగులబెట్టారు. నెమలికంటి నాగేశ్వరరావుకు చెందిన 500 బొంగులు కాలిపోయాయి. ఉండవల్లి గ్రామస్థులు కుర్రపోలు మల్లికార్జునరెడ్డికి చెందిన 600 బొంగులు, పల్లప్రోలు సాంబిరెడ్డికి చెందిన 2వేల బొంగులు, 20 బస్తాల ఎరువులు కాలి బూడిదగా మారాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. అప్పట్లో పోలీసులు హడావిడి చేసి కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటికీ ఆయా కేసుల్లో పురోగతి కనిపించలేదు.

భూములు ఇవ్వని వారిపై అన్ని రకాల ఒత్తిళ్లు: బోయపాటి సుధారాణి
కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణి భూ సమీకరణను వ్యతిరేకిస్తూ అప్పట్లో మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి, తనకున్న 70 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఇస్తున్నట్టు ప్రకటన చేయించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.శ్రీధర్, ఇతర రెవెన్యూ అధికారులు ఆమెతో గుంటూరులో చర్చలు జరిపి ఆ భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు ప్రకటన చేయించారు. తాజాగా తుళ్లూరులో జరిగిన సంఘటనను ఆమె వద్ద ప్రస్తావిస్తే, ‘ఈ ప్రభుత్వానికి ఇటువంటివి అలవాటే. భూములు ఇవ్వని వారిపై అన్ని రకాలుగా బంధువులు, స్నేహితులు, అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తారు. బెదిరిస్తారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తారు. తీరా భూములు ఇచ్చిన తర్వాత ప్రకటించిన ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తారు’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు