ఒంటరి స్త్రీలకూ ‘ఆసరా’!

6 Jan, 2017 04:05 IST|Sakshi

నేడు అసెంబ్లీలో సీఎం ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలకు కూడా ‘ఆసరా’పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం శాసనసభలో విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆదరణకు నోచుకోని జోగినులు, విడాకులు పొందిన వారు, పెళ్లికాని మహిళలు.. ఒంటరి స్త్రీల కేటగిరీలోకి వస్తారు. ఇటువంటి వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని ఎంతో కాలంగా డిమాండ్‌ ఉన్నందున, గత కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అనంతరం ప్రభుత్వం సాను కూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు ఒంటరి స్త్రీలు సుమారు 4లక్షల మంది వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వీరందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందిస్తే, ప్రస్తుతం ఆసరా పథకానికి వెచ్చిస్తున్న రూ.394కోట్లకు తోడు మరో రూ.40కోట్ల భారం పడనుందని అధికారులు లెక్కలు తేల్చారు.
 

మరిన్ని వార్తలు