మహిళా సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం

30 Sep, 2016 21:46 IST|Sakshi
మహిళా సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం
  •   శ్రామిక మహిళ జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ కే హేమలత 
  •  
    గుంటూరు వెస్ట్‌ : సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి దేశవ్యాప్త ఆందోళన చేపట్టేందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నామని శ్రామిక మహిళ జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ కే హేమలత తెలిపారు. గుంటూరులో నిర్వహించిన శ్రామిక మహిళ జాతీయ సభలకు విచ్చేసిన ఆమె శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ సెంటర్‌లు, మధ్యాహ్న భోజన పథకం, ఆశావర్కర్లు, బీడీ పరిశ్రమ, మిర్చి తదితర రంగాలతోపాటు, ప్రై వేట్‌రంగంలో మహిళలు లక్షలాది మంది పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేసే మహిళలకు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, పని ప్రదేశాలలో వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న శీతాకాల సమావేశాలలో స్మాల్‌ ఫ్యాక్టరీస్‌ చట్టాన్ని తీసుకురాబోతున్నదని, దీనిద్వారా 40 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలలో కార్మిక చట్టాలు అమలుకావని చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే చిన్నతరహా పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. నవంబర్‌ 26 నుంచి 30 వరకు ఒడిశాలోని పూరీలో జరిగే సీఐటీయూ జాతీయ సభలలో కార్మికరంగం, మహిళల సమస్యలపై చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సమావేశంలో శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ కే ధనలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే నాగేశ్వరరావు, అధ్యక్షుడు డి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.  
     
మరిన్ని వార్తలు