ఉన్మాదం..

24 Jul, 2016 16:30 IST|Sakshi
ఉన్మాదం..

♦ డబ్బుల విషయంలో ఘర్షణ
♦ తల్వార్‌తో కుటుంబంపై దాడి
♦ ముగ్గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
♦ గాంధీ ఆస్పత్రికి తరలింపు

కామారెడ్డి: కామారెడ్డిపట్టణంలోని బతుకమ్మకుంటకాలనీలో శనివారం రాత్రి చిన్న గొడవలో ఉన్మాదిగా మారిన యువకుడు ఓ కుటుంబంపై తల్వార్‌తో విచక్షణార హితంగా దాడి చేశాడు. కామారెడ్డి డీఎస్పీ ఎ.భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం...బతుకమ్మకుంట కాలనీకి చెందిన శేక్‌అలీ,మజార్‌అలీల మధ్య డబ్బుల విషయంలో శనివారం రాత్రి గొడవ జరిగింది. శేక్‌అలీ బావమరిది మహ్మద్‌ షరీఫ్‌(22) అక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కోపంతో మజార్‌అలీ అక్కడే హసన్‌చావూస్‌ను తల్వార్‌ తీసుకురమ్మని పురమాయించాడు. ఇంట్లోకి వెళ్లిన హసన్‌చావూస్‌ తల్వార్‌ తీసుకువస్తూనే షరీఫ్‌పై దాడి చేశాడు.

ఇంటి ముందర ఉన్న షరీఫ్‌ తల్లి హుస్సేన్‌బీ(50), వదిన రజియాబేగం(25) అడ్డు వెళ్లారు. షరీఫ్‌పై తల్వార్‌తో దాడి చేసిన హసన్‌చావూస్‌ హుస్సేన్‌బీ, రజియాబేగంలపై కూడా అదే తల్వార్‌తో దాడి చేశారు. దీంతో షరీఫ్, హుస్సేన్‌బీ, రజియాబేగంలు తీవ్ర గాయాలపాలై రక్తపుమడుగులో పడ్డారు. విషయం తెలిసిన పట్టణ సీఐ శ్రీనివాస్‌రావ్‌ తన బలగాలతో చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్ర రక్తస్రావం అవుతుండగా స్థానిక వైద్యులు వెంటనే చికిత్సలు చేసినా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్సులో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.

బతుకమ్మకుంట కాలనీలో గొడవలు జరుగకుండా పట్టణ సీఐ శ్రీనివాస్‌రావ్, ఎస్సై శోభన్‌ అక్కడే మకాం వేశారు. కాగా హసన్‌చావూస్‌ తల్వార్‌ తెచ్చిన వెంటనే విచక్షణారహితంగా దాడి చేయడంతో ముగ్గురికి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగానే ఉంది.  

 

>
మరిన్ని వార్తలు