ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసు

13 Nov, 2015 03:32 IST|Sakshi
ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసు

దాయాదుల మధ్య ‘టపాసుల’ చిచ్చు

 హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దాయాదుల మధ్య టపాసుల చిచ్చు రేగింది. టపాసుల దుకాణం ఏర్పాటు ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటనలో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై హత్యాయత్నం కేసు నమోదైంది. హైదరాబాద్ శివారులోని చింతల్‌లో వివేకానంద్, తన బాబాయి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌లకు సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఎమ్మెల్యే వివేకానంద్ సూచన మేరకు హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణం ఏర్పాటు చేశాడు. వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని ప్రతాప్ తనయుడు కేపీ విశాల్ దుకాణదారుడిని నిలదీశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాటామాటా పెరగడంతో వివేకానంద్ ఆగ్రహాంతో విశాల్‌పై చేయి చేసుకున్నారు. తనపై దాడి చేసి కొట్టారని విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఎమ్మెల్యే వివేకానంద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రూ.15 వేల విలువైన టపాసులు ఇవ్వాలని తనను బెదిరించారని దుకాణ యజమాని హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాల్‌పై పలు కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు