అయుతం.. అద్భుతం!

2 Dec, 2015 00:59 IST|Sakshi
అయుతం.. అద్భుతం!

ప్రతిష్టాత్మక క్రతువుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం
♦ అంగరంగ వైభవంగా జరగనున్న అయుత చండీయాగం
♦ 30 ఎకరాల్లో ఏర్పాట్లు.. రూ.20 కోట్లపైనే వ్యయం
♦ దాదాపు 4 వేల మంది బ్రాహ్మణులు
♦ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పండితులు
♦ యజ్ఞగుండాలకు దాదాపు 12 టన్నుల నైవేద్యం
♦ నిత్యం కుంకుమార్చనలు, నవగ్రహ జపాలు, అభిషేకాలు
♦ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, పలువురు సీఎంలకు ఆహ్వానం
♦ హాజరయ్యేందుకు ప్రణబ్ ముఖర్జీ సంసిద్ధత
♦ నిత్యం 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా..
♦ అందరికీ భోజన ఏర్పాట్లు
♦ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహణ
 
 సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, విమర్శల హోరు ఎగిసినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లటమే ఆయన ప్రత్యేకత! గతంలో ఉద్యమ నేతగా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే పంథా! ఇదే కోవలోనే ఇప్పుడు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా అయుత చండీయాగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ నేలపై చండీయాగం అనగానే వెంటనే గుర్తుకొచ్చేపేరు కేసీఆర్. ఉద్యమ నేతగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా మానసిక దృఢత్వానికి ఆయన దైవాన్ని కూడా నమ్ముకుంటారనే పేరుంది. ఈ కోవలోనే ఆయన చండీ అమ్మవారిని ఆరాధించటం ఆనవాయితీగా చేసుకున్నారు. నవ చండీయాగం, శత చండీయాగం, సహస్ర చండీయాగం.. ఇలా వివిధ సందర్భాల్లో ఆయన ఆరు పర్యాయాలు ఈ యాగాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి హోదాలో మరోసారి చండీయాగానికి సిద్ధపడ్డారు. ఈసారి చాలా అరుదుగా నిర్వహించే అయుత చండీయాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మవారి యాగాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ‘అయుతం’ అంటే పదివేలు. చండీ సప్తశతీ స్తోత్రాలను పదివేల మార్లు పారాయణం చేస్తూ తర్పణాలు వదలటమే ఈ అయుత చండీయాగం.

 ఉద్యమ సమయం నాటి మొక్కు
 గతంలో టీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ ప్రాంగణం సహా వివిధ ప్రాంతాల్లో చండీయాగాలు నిర్వహించిన కేసీఆర్ ఈ ప్రతిష్టాత్మక అయుత చండీయాగానికి మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ దీనికోసం 30 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో కేవలం యాగశాలకే 5 ఎకరాలు కేటాయించారు. డిసెంబరు 23 నుంచి 27 వరకు ఈ యాగం జరగనుంది. దీనికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్నందున యాగానికి హాజరయ్యేందుకు రాష్ట్రప్రతి ప్రణబ్ అంగీకరించినట్టు తెలిసింది.

ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఆయన ఆహ్వానించనున్నారు. గవర్నర్ నరసింహన్‌ను మంగళవారమే ఆహ్వానించారు. కేసీఆర్ దీన్ని పూర్తిగా సొంత కార్యక్రమంగానే నిర్వహించనున్నారు. ఇందుకు దాదాపు రూ.20 కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్టు సమాచారం. దశాబ్దాల కోరిక ‘తెలంగాణ’ కల సాకారమైనందున ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని, ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునే క్రమంలోనే నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ యాగం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీన్ని కవర్ చేసేందుకు జాతీయ మీడియా కూడా ఎర్రవల్లికి రాబోతుండటం విశేషం.
 
 యజ్ఞ విశేషాలివీ..
 ► ఈ యజ్ఞంలో పాలుపంచుకునే రుత్విక్కులు, ఇతర బ్రాహ్మణులు ఉప్పు, కారం అతి తక్కువగా ఉండే భోజనాన్నే స్వీకరిస్తారు. సాధారణ ఉప్పుకు బదులు సైంధ వ లవణాన్ని స్వల్ప మోతాదులో వంటల్లో వాడతారు. అందుకే వీరి కోసం ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేయనున్నారు.
► చండీయాగంలో శృంగేరీ విధానం ప్రత్యేకం. అందుకే అయుత చండీయాగాన్ని శృంగేరీ శ్రీ భారతీతీర్థస్వామి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్వామి శిష్యులైన కరీంనగర్ వాస్తవ్యులు పురాణం మహేశ్వర శర్మకు యజ్ఞ బాధ్యతలు అప్పగించారు.
► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక  నుంచి పౌరాణికులు హాజరవుతున్నారు. వీరందరికీ అదే ప్రాంగణంలో ప్రత్యేక బస ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం వేల మంది యాగాన్ని తిలకించేందుకు వస్తారని అంచనా వేస్తున్నందున ప్రతిరోజూ 30 వేల మందికి సరిపడేలా భోజన ఏర్పాట్లు చేయనున్నారు.
► యాగం కోసం ఐదెకరాల సువిశాల స్థలంలో వంద హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గుండం వద్ద 11 మంది రుత్విక్కులు కూర్చుని పారాయణం చేస్తారు.
► నిత్యం కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, నవగ్రహ జపాలు, మహారుద్ర పురచ్ఛరణ అభిషేకాలు, ప్రవచనాలు, సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తారు.
► వేద పండితులు పాలకుర్తి నృసింహారామ సిద్ధాంతి, పట్లూరి మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాప్రేలతో పాటు ఇతర పండితులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
► ప్రముఖులు రానున్నందున వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గాల్లో కొత్తగా రోడ్లను నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సుందరంగా మారుస్తున్నారు.
 
 చాలా అరుదుగా..
 నవ, శత, సహస్ర చండీయాగాలు ని ర్వహించటం సాధారణమే అయినా... అ యుత చండీయాగాలను చాలా అరుదుగా నిర్వహిస్తుంటారు. గతంలో శ్రీ శృంగేరీ శారదాపీఠంలో 2011లో భారతీతీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో, 2014లో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పరిపూర్ణానందస్వామి నిర్వహణలో 12 రోజుల పాటు అతిరుద్ర సహిత అయుత చండీయాగం నిర్వహించారు. గత మార్చిలో మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలోని శ్రీ దుర్గాభవానీ క్షేత్రంలో శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో జరిగింది.

మరిన్ని వార్తలు