లాహిరి లాహిరి లాహిరిలో..

12 Sep, 2016 23:14 IST|Sakshi
లాహిరి లాహిరి లాహిరిలో..
పక్షి ప్రేమికుల స్వర్గధామమైన కైకలూరులోని ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు చేస్తూ విదేశీ పక్షుల అందాలను తిలకించడం ఓ మధురానుభూతి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ అవకాశాన్ని పర్యాటకులకు దగ్గరచేస్తూ అటవీశాఖ రేంజర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ సోమవారం బోటు షికారును ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా పక్షుల విహార చెరువు నీరు లేక ఎండిపోయింది. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు నాగరాజు ఏరుకు పూర్తిస్థాయి నీరు రావడంతో గండికొట్టి నీటిని చెరువులోకి మళ్లించారు. ఇప్పుడు చెరువు నిండుకుండను తలపిస్తోంది. దీంతో పెలికాన్‌ (గూడబాతు), పెయింటెడ్‌ స్టార్క్స్‌ (ఎర్రకాళ్ల కొంగ), గ్రేహెరాన్‌ (నారాయణ పక్షి), బ్లాక్‌ ఐబీస్‌ (నల్ల కంకణాల పిట్ట), ఈ గ్రేట్స్‌ (తెల్లకొంగ), పర్పుల్‌ మోర్‌హెన్‌ (కొండింగాయి), బ్లాక్‌ వింగేడ్‌ స్టిల్ట్‌ (ఎర్ర కాళ్ల ఉలస), కామన్‌ టీల్‌ (పరజా) కనువిందు చేస్తున్నాయి. 
ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ పక్షుల కేంద్రం వద్ద మొత్తం మూడు బోట్లకు గానూ ఒక బోటును అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో మరో రెండు బోట్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక కుటుంబం బోటు షికారుచేస్తే రూ.200 టికెట్‌ ఉండేదని, ఇప్పుడు రూ.250కు పెంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఫారెస్టు రేంజర్‌ ఈశ్వరరావు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.  – ఆటపాక (కైకలూరు)
 
 
మరిన్ని వార్తలు