భారీ వర్ష సూచన | Sakshi
Sakshi News home page

భారీ వర్ష సూచన

Published Mon, Sep 12 2016 11:13 PM

భారీ వర్ష సూచన - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : జిల్లాకు భారీ వర్షం పొంచి ఉంది. రాబోయే రెండు, మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ నీతూప్రసాద్‌ సోమవారం జిల్లా అధికారులతో కలెక్టరేట్‌ సమావేశమందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. భారీవర్షాలు పొంచి ఉన్నందున క్షేత్రస్థాయి సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేసి ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. గోదావరితీర ప్రాంత గ్రామాల ప్రజలను రాబోయే 3రోజులపాటు వాగులు, నదులవద్దకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి నిత్యావసర వస్తువులు, తాగునీరు, కిరోసిన్, ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యుత్‌ స్తంభాలు పడిపోయే ప్రమాదమున్నందున వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు సన్నద్ధమవ్వాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో వైర్‌లెస్‌ సెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లావ్యాప్తంగా 104, 108 వాహనాలతోపాటు మెడికల్‌ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం కలిగితే ఎమర్జెన్సీ ల్యాంపులను సిద్ధంగా ఉంచాలన్నారు. భారీ వర్షాలు, వరదలొచ్చినా ప్రాణనష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీవర్షాలకు రోడ్లు కొట్టుకుపోయినప్పుడు ప్రజలు అదే గ్రామాల్లో ఉండాలని, తెగిన రోడ్లు దాటివచ్చే సమయంలోనే ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భారీవర్షాలతో జరిగిన పంట నష్టం, కూలిన ఇళ్ల వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు పంపించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎస్పీతో కలిసి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. భారీవర్షాలతో ఇబ్బంది పడే గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. గోదావరినదితోపాటు చెరువులు, వాగుల వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని అంచనా వేయాలని కోరారు. సమావేశంలో ఎస్పీ జోయల్‌డేవిస్, జేసీ శ్రీదేవసేన, నగర పాలక సంస్థ కమిషనర్‌ కృష్ణభాస్కర్, డీఆరోవో వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు. 
 
అధికార యంత్రాంగమంతా ‘ప్యాకప్‌’పైనే దృష్టి
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగమంతా ఫైళ్ల విభజన, స్కానింగ్, అప్‌లోడింగ్‌పైనే నిమగ్నమైంది. ఏ కార్యాలయంలో చూసినా ఇదేపనిలో ఉన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన సోమవారం మరోసారి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈనెల 15లోపు అప్‌లోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని స్పష్టంచేశారు. అదేసమయంలో కలెక్టర్‌ నీతూప్రసాద్‌ కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఆరాతీశారు. జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాల్సి రావడంతో ఫైళ్ల విభజన, అప్‌లోడింగ్, స్కానింగ్‌ ప్రక్రియలో కొంత జాప్యం ఏర్పడే అవకాశాలున్నాయి. 
మెదక్‌ జిల్లా యంత్రాంగానికే..
హుస్నాబాద్‌ను రెవెన్యూ కేంద్రంగా మార్చే అంశాన్ని జిల్లా అధికార యంత్రాంగం మెదక్‌ జిల్లా అధికారులకే వదిలేశారు. కొత్తజిల్లాల సందర్భంగా హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వెళ్తున్నందున హుస్నాబాద్‌ను రెవెన్యూ కేంద్రంగా మార్చే అంశంపై ఆ జిల్లా అధికారులే కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ కోరుట్లకు చెందిన నాయకులు ప్రత్యేకబస్సులో సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
 
 

Advertisement
Advertisement