చలానాలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లుచీటీ

18 Oct, 2015 04:51 IST|Sakshi
చలానాలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లుచీటీ

సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా కొనసాగుతున్న మూస పద్ధతులకు రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే చెల్లుచీటి ఇవ్వబోతోంది. వివిధ క్రయ విక్రయాలకు సంబంధించిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపునకు ప్రస్తుతం అమ ల్లో ఉన్న బ్యాంకు చలానాలకు బదులుగా, ఆన్‌లైన్ చెల్లింపు విధానాలను అవలంభిస్తే మేలని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినియోగదారుల ఆకాంక్షల మేరకు క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.. వంటి మోడరన్ బ్యాంకింగ్ సేవలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ బ్యాంకు శాఖలున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజా నిర్ణయానికి సంబంధించి సర్కారు అనుమతి కోసం శాఖ నుంచి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే ఆన్‌లైన్ చెల్లింపులను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా ఒకే బ్యాంకు ఖాతా..
 వినియోగదారుల నుంచి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు స్వీకరించేందుకు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ స్థానికంగా అం దుబాట్లో ఉన్న బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నాయి. దీనివల్ల ఏదైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వినియోగదారులు అక్కడే ఉన్న బ్యాంకులో చ లానా ద్వారా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి. అలాగే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం వల్ల వచ్చిన సొమ్మును రాష్ట్ర ఖాతాకు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దీంతో ఎప్పటికప్పుడు రెవెన్యూ వసూళ్లకు సం బంధించిన లెక్కలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులకు వీలు కావడం లేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఒకే బ్యాంకు ఖాతాను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా వినియోగదారులు ఏ ప్రాంతంలో సొమ్ము చెల్లించినా సదరు వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుందని, రెవెన్యూ వసూళ్లలో పారదర్శకతకు దోహదపడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

 ఆధార్‌తో అక్రమాలకు చెక్..
 అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వినియోగదారుల ఆధార్ నంబరును సేకరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆధార్ నంబరు ఇవ్వడం తప్పనిసరి కాకున్నా, అక్రమాలను నివారించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులను ఒప్పించి వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే ఆధార్ వివరాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు