ఏడుగురు సజీవ సమాధి

15 May, 2016 02:17 IST|Sakshi
ఏడుగురు సజీవ సమాధి

- ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో విషాదం
- భవనం పునాది తీస్తుండగా కూలిన మట్టిపెళ్లలు, గోడ
- వేసవి సెలవుల్లో ఉపాధి కోసం వచ్చిన విద్యార్థులు, యువకుల మృత్యువాత..  
- నాలుగు మృతదేహాల వెలికితీత మట్టిపెళ్లల కింద మరో ముగ్గురు?
- కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు
- అధికార పార్టీనేత చుక్కపల్లి రమేశ్ నిర్వాకంతో ప్రమాదం
- ఆగ్రహంతో మంత్రి రావెల కారుపై బాధితుల బంధువుల దాడి

 
సాక్షి, గుంటూరు: 
వారు పదో తరగతి, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, యువకులే. అంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వేసవి సెలవులో కావడంతో నాలుగు రూకలు సంపాదించుకోవడం కోసం భవన నిర్మాణ పనుల్లోకి దిగారు. అధికార పార్టీకి చెందిన డెవలపర్ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన గుంటూరులో శనివారం చోటుచేసుకుంది. డెవలపర్ ధనదాహం  ఏడుగురి ప్రాణాలను బలితీసుకుందని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

గుంటూరులోని లక్ష్మీపురం ప్రధాన రహదారిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భవన  పునాదుల కింద ఏడుగురు సజీవ సమాధి అయ్యారు. గుంటూరులోని డాక్టర్ సుబ్బారావుకు చెందిన స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు అధికార టీడీపీ నేతలు చుక్కపల్లి రమేశ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు.  గత మూడు నెలలుగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన యువకులు, విద్యార్థులు వేసవి సెలవులు కావడంతో నగరానికి చెందిన రాము అనే కాంట్రాక్టర్ ద్వారా పనుల్లోకి వచ్చారు.

శనివారం సెల్లార్ నిర్మాణం పనులను తాము చేయలేమని, చుట్టూ పది అడుగుల స్థలం వదలకుండా సెల్లార్ నిర్మాణం చేపట్టారని, అదేవిధంగా రక్షణగా ఫెన్సింగ్ నిర్మాణం చేయలేదంటూ వారు పనులు నిలిపివేశారు. దీంతో పనులు త్వరగా పూర్తి కావాలని, డబ్బు ఎక్కువ ఇస్తామని బిల్డర్ ఆశ చూపడంతోపాటు ఒత్తిడి చేశారు. దీంతో చేసేది లేక 30 అడుగుల లోతులో కాంక్రీట్ దిమ్మెలను నిర్మించేందుకు కూలీలు సన్నద్ధమయ్యారు.

ఈ సమయంలో ప్రశాంత్ అనే కార్మికుడిపై తొలుత మట్టిపెళ్లలు విరిగి పడగా, మిగతా వారు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే భారీగా మట్టిపెళ్లలు, పక్కనే ఉన్న గోడ  కూలడంతో మిగిలిన వారు సైతం అందులో చిక్కుకుపోయారు. పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల నుంచి మొదట తురకా శేషుబాబు(21) మృతదేహం బయటపడింది. తర్వాత బయటపడిన వాసిమల్ల మరియదాసు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బూసి సలోమన్(21), బత్తుల సునీల్(19)తోపాటు మరో యువకుడి మృతదేహం బయటపడ్డాయి. శిథిలాల కింద ఇంకా ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఎప్పుడో జరిగితే ఇప్పుడొస్తారా?
ప్రమాదం గురించి తెలియగానే బాధితుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.  తొలుత వీరిని పోలీసులు, చుక్కపల్లి రమేశ్ అనుచరులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రమాదానికి గురైన వారు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదగొట్టిపాడు గ్రామస్తులు కావడంతో మంత్రి రావెల కిషోర్బాబు వారిని పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి వచ్చారు. ఎప్పుడో ప్రమాదం జరిగితే ఇప్పుడా వచ్చేది అంటూ బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కారుపై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో చేసేది లేక మంత్రి రావెల కారు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మట్టి శిథిలాల కింద మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.5.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రకటించారు. శనివారం రాత్రి 11 గంటల తరువాత కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతదేహాలను బయటకు తీసుకెళ్లేందుకు యత్నించగా, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకుని ధర్నాకు దిగారు. దీంతో సంఘటనా స్థలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైఎస్సార్ సీపీ నేత రావి వెంకటరమణ తదితరులుబాధితుల కుటుంబ సభ్యులున పరామర్శించారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని, కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని కోడెల చెప్పారు.

సిటీప్లానర్ పై దాడి:  ఘటనాస్థలికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మీ, సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు చేరుకోగా.. వారిపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల బంధువులు దాడి చేయడంతో సిటీప్లానర్ ధనుంజయరెడ్డికి గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు