హమ్మయ్యా.. ఇప్పటికి బయటపడ్డాం !

22 Sep, 2017 13:41 IST|Sakshi
హమ్మయ్యా.. ఇప్పటికి బయటపడ్డాం !

వాయిదా పడ్డ కేంద్ర బృందం పర్యటన
ఊపిరి పీల్చుకుంటున్న ‘ఉపాధి’ సిబ్బంది
రికార్డుల్లో లొసుగులతో అంతర్గత మధనం
అంతర్గత ఆడిట్‌లో సంతృప్తికర ఫలితాలు
వచ్చాయంటున్న అధికారులు


రికార్డుల పరిశీలనకు కేంద్ర బృందం రానున్నదనే సమాచారంతో ఉపాధి హామీ పథకం సిబ్బందిలో గుబులు మొదలైంది. హడావుడిగా గత కొన్ని రోజులుగా రాత్రనకా, పగలనక రికార్డులు సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత జిరాక్సు కాపీలకే వేల రూపాయలు ఖర్చయ్యాయంటే ఏమేరకు సిద్ధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం బృందం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందన్న సమాచారంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు...

సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకం సిబ్బందికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఇప్పటి వరకు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డుల పరిశీలనకు ఈనెలలో రాష్ట్ర, కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు హడావుడిగా రికార్డులు సిద్ధం చేసుకున్నారు. తమ తప్పులు ఎక్కడ బహిర్గమవుతాయోనని ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జిల్లాకు రాష్ట్ర బృందం మాత్రమే తనిఖీలకు వచ్చినట్లు సమచారం. కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జిల్లా ఉపాధి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేంద్ర బృందం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే.. ఆ తనిఖీ ల్లో రికార్డుల నిర్వహణ, నిధుల వెచ్చింపుల్లో తేడాలు వస్తే శాఖపరమైన చర్యలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మదన పడ్డారు.

అంతర్గత ఆడిట్‌లో సంతృప్తికర ఫలితాలు !
ఉపాధి పథకం నిధులతో జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీల్లో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఎన్టీఆర్‌ గృహాలు తదితర వాటికి రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లతో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఈ పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ గతంలో గందరగోళంగా ఉండేది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుందన్న ఆదేశాలతో అధికారులు రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో మండలంలో రూ.50 వేలు జిరాక్స్‌ కాపీలకే వెచ్చించారంటే ఏ మేరకు క్రమబద్ధీకరించారో అర్థం అవుతోంది. గత నెలలోనే బృందం జిల్లాకు రావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వచ్చింది.

ఈనెలలో కూడా బృందం వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఐదేళ్లుగా ఉపాధి పథకం నిధుల వ్యయంపై అంతర్గత ఆడిట్‌ నిర్వహించారు. ఆ ఆడిట్‌లో ఎలాంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం బహిర్గతం కాలేదని డ్వామా పీడీ రాజగోపాల్‌ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. రికార్డుల నిర్వహణ సైతం పక్కాగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత ఆడిట్లో సైతం ఎలాంటి తప్పులు బయటపడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు