చెక్‌ ‘ఢాం’

12 Jul, 2017 10:39 IST|Sakshi
చెక్‌ ‘ఢాం’
  • అంతులేని అవినీతిఔ
  • నీటి నిల్వ సంరక్షణ పనులకు రూ.2.30 కోట్ల ఖర్చు
  • అప్పుడే నెర్రలు చీలిన కట్టడాలు
  • నాణ్యతను గాలికొదిలి నిధులు బొక్కేసిన వైనం
  • వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో అధికార పార్టీ నేతల అక్రమాలు 
  •  

    వాన నీటి సంరక్షణ పనుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. వజ్రకరూరు వాటర్‌షెడ్‌ పరిధిలో చేపట్టిన నిర్మాణాల్లో అడుగడుగునా డొల్లతనం కనిపిస్తోంది. చెక్‌డ్యాంలన్నీ నాసిరకంగా చేపట్టి అధికారులు, అధికార పార్టీ నేతలు నిధులు మింగేశారు. ఫలితంగా లక్షలాది రూపాయిలు వెచ్చించి నిర్మించిన కట్టడాలు నెర్రెలిచ్చి పగిలిపోతున్నాయి.

    వానొస్తే నీరు ఒడిసి పట్టాల్సిన చెక్‌డ్యాంలు మూన్నాల్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. 2009–10 బ్యాచ్‌ కింద మంజూరైన వజ్రకరూరు వాటర్‌షెడ్‌ పరిధిలో 28 కొత్త చెక్‌డ్యాం నిర్మాణాలకు రూ.98.33 లక్షలకు పరిపాలనా పరమైన అనుమతి వచ్చింది. ప్రాజెక్ట్‌ ముగిసే నాటికి(గత ఏడాది సెప్టెంబర్‌) నిర్మాణాలు పూర్తి చేసి రూ.79.38 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఎన్‌ఎన్‌పీ తండాలో ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.3.52 లక్షలు, తట్రకల్లులో పది నిర్మాణాలకు రూ.33.45 లక్షలు, వజ్రకరూరులో ఆరు నిర్మాణాలకు 13.06 లక్షలు, బోడిసానిపల్లిలో ఐదింటికి రూ.15.28 లక్షలు వెచ్చించారు.

    నిధుల ఖర్చు బాగానే ఉన్నా కట్టడాల్లో మాత్రం నాణ్యత కొరవడింది. ఈ కారణంగా ఏ చెక్‌డ్యాంను చూసినా పగుళ్లు కనిపిస్తున్నాయి. తట్రకల్లులో రైతు దేవపుత్ర పొలం వద్ద నిర్మాణం పూర్తి నాసిరకంగా ఉంది. నీళ్లొస్తే లీకేజీ అయ్యే పరిస్థితి. ఎన్‌ఎన్‌పీ తండాలో రైతు సోమ్లానాయక్‌కు చెందిన పొలం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మట్టి, పొలాల్లో లభించిన రాళ్లను నిర్మాణాలకు ఉపయోగించారు. వజ్రకరూరులోని మద్దిలేటి, బెస్త వెంకటరెడ్డి పొలాల వద్ద నిర్మించిన చెక్‌డ్యాంలు అప్పుడే లీకేజీ అవుతున్నాయి. కొన్ని చోట్ల పనులు తక్కువగా ఉన్నా ఎక్కువ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి అదనంగా బిల్లులు దిగమింగినట్లు స్పష్టమవుతోంది.

     

    సంరక్షణ కాదు.. అంతా ‘భక్షణే’

    వాటర్‌షెడ్‌ పరిధిలోని గ్రామాల్లో 363 పనులు చేపట్టి రూ.228.33 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నా నాణ్యతను గాలికొదిలేశారు. రూ.8.67 లక్షలతో నాలుగు చెక్‌వాల్, మూడు సర్ఫేస్‌ స్టోరేజ్‌ పాండ్‌ పనులు చేపట్టగా.. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. గంజికుంటలో మూడు నిర్మాణాలకు రూ.10.03 లక్షలు, బోడిసానిపల్లిలో రెండింటికి రూ.62 వేలు, వజ్రకరూరులో నాలుగు నిర్మాణాలకు రూ.6.27 లక్షలు, రాగులపాడులో రెండింటికి రూ.3.78 లక్షలు, ఎన్‌ఎన్‌పీ తండాలో ఒక నిర్మాణానికి రూ.2.30 లక్షలు వెచ్చించారు. తట్రకల్లులో రెండు నిర్మాణాలు చేసినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనట్లు పొందుపరిచారు. అయితే పర్క్యులేషన్‌ పనులు చాలా ప్రాంతాల్లో చేపట్టకుండానే నిధులు బొక్కేసినట్లు తెలుస్తోంది.

    క్షేత్రస్థాయిలో చాలా చోట్ల నిర్మాణాలు కన్పించకపోవడం గమనార్హం. ఇక వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి వంకకు పది మీటర్ల దూరంలో నిర్మించాల్సిన డగ్గౌట్‌ పాండ్‌ పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 73 డగ్గౌట్‌ పాండ్స్‌ నిర్మాణాలకు రూ.78.54 లక్షలకు పరిపాలన అనుమతి లభించగా.. 71 పనులు చేపట్టి కేవలం రూ.18.26 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ పనులు ప్రారంభించినట్లు నమోదు చేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. గంజికుంటలో 19 నిర్మాణాలకు రూ.21.70 లక్షలతో పరిపాలన అనుమతి రాగా 18 పనులకు రూ.4.46 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలేసుకున్నారు. ఐడబ్ల్యూఎంపీ నిధులు కాకుండా ఉపాధి హామీ నిధులను ఖర్చు చేసినట్లు పేర్కొన్నా.. అవి స్థానిక నేతల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం డగ్గౌట్‌ పాండ్స్‌ నిర్మాణాల్లో తప్పనిసరిగా ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ ఛానల్స్‌ ఉండాలి. కానీ ఇక్కడి నిర్మాణాల్లో అవేవీ కన్పించకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు