ఇసుకాసురులకు చేతినిండా పని

18 May, 2017 17:35 IST|Sakshi
ఇసుకాసురులకు చేతినిండా పని

► చెయ్యేరులో క్వారీలకు రంగంసిద్ధం!

రాజంపేట: చెయ్యేరు నది ఇసుకకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ లభించే ఇసుక నాణ్యమైనది కావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి ఇసుక వైపు మొగ్గు చూపుతారు. చెయ్యేరు నదిపై అన్నమయ్య జలాశయం నిర్మించడం వల్ల ఎడారిగా మారిపోయింది. 2015లో వచ్చిన వరదలకు డ్యాం నుంచి లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగింది. ఫలితంగా ఇసుక మేటలు భారీగా వేశాయి. ప్రస్తుతం ఎడారిగా మారిపోవడంతో ఇసుకాసురులకు కలిసివచ్చింది.

నది తీరం వెంబడి ఎక్కడపడితే అక్కడ తోడేస్తున్నారు.ఇప్పటికే ఎంజీపురం నుంచి అధికారికంగా క్వారీలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇసుక రవాణా ఉచితంగా చేసుకోవచ్చునని టీడీపీ సర్కారు ఆదేశించింది. ఈ క్వారీలను అడ్డం పెట్టుకొని అధికార పార్టీకి చెందిన నాయకులు అక్కడా..ఇక్కడా అని లేకుండా ఇసుకను భారీగా తరలించేస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగుంటిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి పథకాలకు ముప్పు వాటిల్లకుండా ఇసుకరీచ్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. చెయ్యేరు నదిపరీవాహక ప్రాంతంలో మూడు రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

రాజంపేట మండలంలోని బాలరాచపల్లె, నందలూరు మండలంలోని టంగుటూరు, పెనగలూరు మండలంలోని కోమంతరాజుపురంలో వీటిని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే కోణంలో అధికారబృందాలు పరిశీలించి వెళ్లాయి. ఈ రీచ్‌లకు జిల్లా కలెక్టరు నుంచి ప్రొసీడింగ్స్‌ రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి అనధికారికంగా ఇసుకను అడపదడపా తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎదీ ఎమైనప్పటికి చెయ్యేరులో మరో మూడురీచ్‌లు వస్తే ఇసుకాసురులకు చేతినిండా పనే  అని  పలువురు అంటున్నారు.  

మరిన్ని వార్తలు