సినిమా చూపిస్త మామా!

11 Jan, 2017 22:47 IST|Sakshi
సినిమా చూపిస్త మామా!
ఖరీదైన వినోదం
రెట్టింపు ధరలకు టిక్కెట్ల విక్రయం
ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి బ్లాక్‌లో అమ్మకాలు 
 ప్రేక్షకుల జేబులు గుల్ల
దందా వెనుక యాజమాన్యాలు
మౌనం వహిస్తున్న రెవెన్యూ, పోలీసు వర్గాలు
సాక్షి, రాజమహేంద్రవరం : సినిమా రిలీజ్‌ అయిందంటే చాలు ప్రేక్షకుల జేబులు గుల్ల అవుతున్నాయి. రిలీజైన మొదటి రెండు,మూడు రోజులు.. వారాంతాలు.. డిమాండ్‌ ఉన్న ప్రతి సమయంలో కూడా బ్లాక్‌ టిక్కెట్ల విక్రయం విచ్చలవిడిగా సాగుతోంది. థియేటర్ల ప్రాంగణంలోనే ఈ దందా సాగుతోంది. కొన్ని యాజమాన్యాలు ఈ దందాను అధికారికంగా నడిపిస్తున్నాయి. థియేటర్‌ సిబ్బందికి టిక్కెట్లు ఇచ్చి రెట్టింపు ధరలకు అమ్మిస్తున్నాయి. మరికొన్ని యాజమాన్యాలు బ్లాక్‌ టిక్కెట్ల విక్రయానికి అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ జిల్లాలో 90 శాతం హాళ్లలో బ్లాక్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంపై అక్కడక్కడా ప్రేక్షకులు యాజమాన్యాలను అడుగుతున్నప్పటికీ బ్లాక్‌ టిక్కెట్ల విక్రయంతో తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకుంటున్నాయి. మీ థియేటర్‌ ప్రాంగణంలోనే టిక్కెట్లు విక్రయిస్తున్నారంటున్నా వారు ఎవరో తమకు పట్టించాలని వితండవాదం చేస్తున్నారు. బ్లాక్‌ టిక్కెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన బాధ్యత థియేటర్‌ యాజమాన్యాలపై ఉన్నప్పటికీ ఆ విషయం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. బయట వ్యక్తులు వచ్చి థియేటర్‌ ప్రాంగణంలో బ్లాక్‌ టిక్కెట్లు విక్రయిస్తుంటే ఏ యాజమాన్యం చూస్తూ ఊరుకోదు. అలాంటిది థియేటర్‌ వద్ద నలుగురైదుగురు వ్యక్తులు బహిరంగంగా అరుస్తూ రూ.40 టిక్కెట్టు రూ.80, రూ.90 టిక్కెట్టు రూ.500 అంటూ అమ్ముతున్నారంటే వారి వెనుక యాజమాన్యాలు తప్పనిసరిగా ఉంటాయన్నది నగ్నసత్యం. అలా లేకపోతే ఎవరో బయట వ్యక్తులకు పదుల సంఖ్యలో టిక్కెట్లు ఎలా వస్తాయన్నది ఇక్కడ ప్రేక్షక్షులు అడుగుతున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం యాజమాన్యాల వద్ద లేదు. క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకుంటున్నారంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. క్యూలో నిలుచున్న వ్యక్తికి ఒక్క టిక్కెట్టు మాత్రమే ఇస్తారు. కుటుంబంతో వస్తే రెండు టిక్కెట్లు ఇస్తారు. అలాంటిది ఒక్కో వ్యక్తి వద్ద 30 నుంచి 50 టిక్కెట్లు ఎలా ఉంటున్నాయి?.
ఆన్‌లైన్‌ దందా...
థియేటర్లలో బాల్కనీ టిక్కెట్‌ ధర రూ.90, సెంకడ్‌ క్లాస్‌ రూ.75, థర్డ్‌ కాస్ల్‌ టిక్కెట్టు ధర రూ.30 ఉంటుంది. థియేటర్లను బట్టీ ఈ ధరలు కొంచెం పెరుగుతాయి. ఈ మూడు క్లాస్‌లలో బాల్కనీ టిక్కెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడతారు. ఇందులోనూ 50 శాతం టిక్కెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో పెడుతూ మిగతావి కౌంటర్‌లో విక్రయించాలి. ఆన్‌లైన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రేక్షకుడికి ఇచ్చే టిక్కెట్‌పై అతని ఫొటోను నిబంధనల ప్రకారం తప్పక ముద్రించి ఉండాలి. కాని ఎక్కడా ఇది అమలు కావడంలేదు. ఒకే వ్యక్తి పేరుపై నాలుగు టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారు. అలా బుక్‌ చేసిన టిక్కెట్లను థియేటర్‌ ప్రాంగణంలో విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ పత్రాలు తీసుకొస్తున్న ప్రేక్షకులకు కౌంటర్‌లో ఉన్న సిబ్బంది టిక్కెట్‌ ఇస్తున్నారు. నాలుగు టిక్కెట్లను వేర్వేరు వ్యక్తులు వచ్చి తీసుకుంటుంటే టిక్కెట్‌ ఇచ్చే సిబ్బంది ఎక్కడా ప్రశ్నించరు. ఆన్‌లైన్‌ పత్రంలో ప్రేక్షకుడి ఫొటో లేకపోయినా టిక్కెట్‌ ఇస్తారు. కౌంటర్‌ వద్దకు వచ్చిన ప్రేక్షకులు టిక్కెట్‌ కావాలని అడిగితే ఆన్‌లైన్‌లో అయిపోయాయంటూ సిబ్బంది సమాధానం చెబుతారు. నిబంధనల ప్రకారం చేస్తున్నామంటూ చెప్పుకోవడానికి ఓ 10 టిక్కెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలి టిక్కెట్లను తమ సిబ్బందితో బ్లాక్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు. చివరకు రూ.30, రూ.75ల టిక్కెట్లు కూడా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. 
సీజన్‌.. సినిమాను బట్టీ రేట్లు!
సినిమా, హీరో, సీజన్‌, డిమాండ్‌ను బట్టి బ్లాక్‌ టిక్కెట్ల ధరలు రెట్టింపవుతుంటాయి. బుధవారం విడుదలైన ఓ అగ్రహీరో సినిమాకు రూ.90 టికెట్‌ను యాజమాన్యాలే అధికారికంగా రూ.150 చొప్పున విక్రయించాయి. బ్లాక్‌లో అయితే రూ.500 వరకు అమ్మారు. అదే మధ్యస్థాయి హీరో సినిమా అయినా ఈ ధర రూ.250 వరకు ఉంటుంది. ఇక వారాంతాలు, పండగ సీజన్లలో సినిమా చూడాలంటే నలుగురు ఉన్న కుటుంబం కనీసం రూ.1,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక వాహనం పార్కింగ్, తినుబండారాలు, శీతలపానీయాలు రెట్టింపు ధరలకు అమ్ముతున్నా అడిగేవారు లేరు. థియేటర్లలో లభించే ఆహారం నాణ్యతపై ఫుడ్‌ కంట్రోలర్, సేఫ్టీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. థియేటర్ల వద్ద అధిక ధరలకు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీసు విభాగాలు మౌనం వహిస్తున్నాయి. 
కఠిన చర్యలు తీసుకుంటాం...
సినిమా హాళ్లలో టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే అందుకు బాధ్యత థియేటర్‌ యాజమాన్యానిదే. యాజమాన్యానికి తెలియకుండా ఒక్కో వ్యక్తి వద్ద పదుల సంఖ్యలో టిక్కెట్లు ఎలా ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయంపై కూడా పరిమితులు ఉన్నాయి. బ్లాక్‌ టిక్కెట్ల వ్యహారంపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్‌. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు