కలెక్టర్‌ సీరియస్‌

21 Jul, 2016 23:36 IST|Sakshi
కలెక్టర్‌ సీరియస్‌

– ఉదయం 8 గంటలకే పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్న కలెక్టర్‌
– ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసంతప్తి
 – కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులపై ఆగ్రహం

శ్రీశైలం :
కృష్ణా పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండటంతో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులపై కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయుడుతో కలిసి ఆయన గురువారం ఉదయం 8 గంటలకు  రోప్‌వే ద్వారా పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ  ఏమాత్రం పనులు జరగక పోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచి సీరియస్‌గా క్లాస్‌ తీసుకున్నారు. ఇలా వ్యవహరిస్తే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కర పనులకు కేటాయించిన కాంట్రాక్టర్‌  కాకుండా సబ్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండడంతో అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించాల్సిందిగా సూచించారు. అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించినా రాకపోవడంతో సదరు కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాన ని హెచ్చరించారు. రోజుకు ఎన్ని క్యూబిక్‌ మీటర్ల పనులను పూర్తి చేస్తున్నారని అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులను అడుగగా, వారు తెల్ల మోహం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి లింగాలగట్టు వద్ద జరుగుతున్న ఘాట్ల నిర్మాణపు పనులను పరిశీలించారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో కలెక్టర్‌కే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అనంతరం టెలీకాన్ఫరెన్స్‌ ఉండడంతో తహసీల్దార్‌ కార్యాలయం చేరుకుని అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలానికి వస్తామని పనులు వేగవంతం చేసి డైలీ రిపోర్ట్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
 

>
మరిన్ని వార్తలు