ఓపికుంటేనే రండి..

20 Dec, 2016 23:52 IST|Sakshi
ఓపికుంటేనే రండి..
  •  సామాన్యులకు అందని  మెరుగైన వైద్యం
  • గంటల తరబడి క్యూలో నిరీక్షణ
  • కౌంటర్లలో సిబ్బంది కొరతే కారణం
  • ఇదీ సర్వజనాస్పత్రిలో పరిస్థితి
  •  

    అనంతపురం మెడికల్‌ :  
    పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందాలంటే సామాన్యులకు గగనంగా మారుతోంది. ఎంతో ఓపిక ఉంటే గానీ ఇక్కడ సేవలు అందడం లేదు. ఉదయం ఓపీ (ఔట్‌ పేషెంట్‌) కౌంటర్లు ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు  భారీ క్యూలు కన్పిస్తున్నాయి.  రోగులు, వారి బంధువులు ఓపీ చీటీల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ పురుషులు, మహిâýæలకు ఒకే కౌంటర్‌ ఉండేది. నలుగురు సిబ్బంది విధుల్లో ఉండేవారు. ఇటీవల వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు కౌంటర్లలో ఇద్దరు చొప్పున విధుల్లో ఉంటున్నారు. ఇటీవల వివిధ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.  ఔట్‌ పేషెంట్లు వెయ్యి దాటుతున్నారు. అనంతపురం చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా ధర్మవరం, ముదిగుబ్బ, కదిరి, తాడిపత్రి, పెనుకొండ, రాప్తాడు వంటి ప్రాంతాల నుంచి కూడా రోగులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. తొమ్మిది గంటలకు ఓపీ ప్రారంభం అవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిస్తున్నారు. ఓపీ చీటీ ఉంటేనే వైద్యులు చికిత్స అందిస్తారు. ఈ చీటీల కోసం వృద్ధులు, చంటి పిల్లలతో వచ్చిన వారు అగచాట్లు పడుతున్నారు. కౌంటర్‌లో ఉంటున్న ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు చీటీ రాస్తే, మరొకరు రోగి వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్యూ లైన్లలో గంటలకొద్దీ నిరీక్షించి సొమ్మసిల్లిపడిపోయే వారూ లేకపోలేదు.  


    అర గంట ఇక్కడే గడిచింది  
    నా కుమార్తె దీపకు రెండ్రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఉదయం 10 గంటలకు ఇక్కడికొచ్చా. చీటీ తీసుకుందామంటే భారీ క్యూ ఉంది. అర గంట దాటినా పరిస్థితిలో మార్పు లేదు. పాప ఉందని చెప్పినా ఎవరూ వినడం లేదు. లైన్లోనే రమ్మంటున్నారు. 

    – సురేష్, కురుగుంట, అనంతపురం రూరల్‌ మండలం


    ఓపీ సమయం పొడిగించాలి
    ఒళ్లంతా దద్దుర్లు, నవ్వలు ఉంటే ఇక్కడికొచ్చా. క్యూ చూసే సరికి వామ్మో అనిపించింది. మధ్యాహ్నం దాటితే డాక్టర్లు వెళ్లిపోతారట. మాలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఓపీ టైం గంట సేపు పొడిగిస్తే మంచిది. కౌంటర్లో కూడా మరొకరిని పెడితే బాగుంటుంది.                             – వెంకటరమణ, ముదిగుబ్బ


    నిలబడలేకున్నా
    నాకు షుగర్, బీపీ ఉన్నాయి. చికిత్స కోసం వచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అసలే ఎక్కువ సేపు నిలబడలేను. క్యూలో ఉన్న వాళ్లు ఓ పట్టాన కదలడం లేదు. చీటీలు ఇచ్చే వాళ్లు కూడా తొందరగా ఇవ్వడం లేదు. పాపం ఇద్దరే ఉన్నారంట. మేము ఇంత సేపు నిలబడాలంటే కష్టంగా ఉంది.  
    –పెద్ద బాలన్న, తాటిచెర్ల, అనంతపురం రూరల్‌ మండలం
     

మరిన్ని వార్తలు