నెరవేరనున్న దశాబ్దాల కల

21 Aug, 2016 21:30 IST|Sakshi
హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయడానికి ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్‌ మండలాలను హన్మకొండ జిల్లాలోకి చేర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో దశాబ్దాల కల తొందరలోనే నెరవేరనుంది. 
- హుజూరాబాద్‌
హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ఓ ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టులో హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోనే తాత్కాలికంగా అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ చేతుల మీదుగా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుత కరీంనగర్‌ ఆర్డీఓ చంద్రశేఖర్‌ను ఇన్‌చార్జి ఆర్డీఓగా నియమించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, హుజూరాబాద్, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, సైదాపూర్, మానకొండూర్‌ మండలంలోని శంకరపట్నం మండలాలను హుజూరాబాద్‌ ఆర్డీఓ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే అంతకుముందే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి కాంగ్రెస్‌ సర్కారు హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. దీంతో హుజూరాబాద్‌లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చాక హుస్నాబాద్‌ను పక్కన పెట్టి హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. దీంతో హుస్నాబాద్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కొందరు ఈ అంశంపై కోర్టుకు వెళ్లడంతో రెండు చోట్ల డివిజన్‌ల ఏర్పాటు నిలిచిపోయింది. 
ఇప్పుడు మోక్షం... 
హుజూరాబాద్‌ కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ కావాలని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం పోరాటాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామంటూ నాయకులు హామీలిస్తూ దీనిని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదనలను పక్కనపెడుతూ వచ్చాయి. తాజాగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ కల నెరవేరనుంది. హుజూరాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. 
సకాలంలో అందనున్న సేవలు...
ప్రస్తుతం హుజూరాబాద్‌తోపాటు పైన పేర్కొన్న మండలాలు కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరగాలంటే ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పనులు జరుగక నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎట్టకేలకు హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో ఇకనుంచి సకాలంలో సేవలందనున్నాయి. భూ సమస్యల పరిష్కారం మెరుగుపడనుందని ప్రజలు భావిస్తున్నారు. 
 
 
మరిన్ని వార్తలు