వీడియో తీసి ‘టార్గెట్‌’ ఎంపిక

21 Aug, 2016 21:41 IST|Sakshi
వీడియో తీసి ‘టార్గెట్‌’ ఎంపిక

భాగ్యనగర్‌ కాలనీ: ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్లమంటూ వీడియో కెమెరాలు పట్టుకొని విల్లాలు, కాలనీల్లో తిరుగుతున్న దొంగలు ‘టార్గెట్‌’ ను గుర్తించి రాత్రిపూట పంజా విసురుతున్నారు. ఇదే విధంగా శనివారం అర్ధరాత్రి కేపీహెచ్‌పీ ఠాణా పరిధిలోని నిజాంపేటలోని రెండు విల్లాల్లో చోరీకి పాల్పడ్డారు.  కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లోని అపార్టుమెంట్లలో వరుస చోరీలు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే దొంగలు మళ్లీ చోరీలకు పాల్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.   

సీఐ కుషాల్‌కర్, బాధితుల కథనం ప్రకారం.. నిజాంపేట కేటీఆర్‌ కాలనీలో గల బాలాజీ మెడోస్‌ విల్లాలోని ప్లాట్‌ నెం.130లో ఉండే బ్యాంక్‌ రిటైర్డ్‌ ఉద్యోగి గోపాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంటి తలుపు గడియ పగులగొట్టి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో భద్రపర్చిన 12 తులాల బంగారు నగలతో పాటు అరకిలో వెండి, రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు.
అదే విధంగా అఖిల విల్లాలో ఉండే రాయప్ప అనే వ్యక్తి బెంగళూరు వెళ్లగా..

దొంగలు ఆయన ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు.  బీరువా పగులగొట్టి రూ. 50 వేల నగదుతో పాటు రూ. 5 లక్షల విలువైన బంగారు నగలు అపహరించుకెళ్లారు.  ఇదే కాలనీలో మరో విల్లాలోని గ్రిల్, డోర్‌ను పగులగొట్టేందుకు దొంగలు యత్నించారు. అయితే, ఆ విల్లా ఖాళీగా ఉండటంతో వెనుదిరిగారు. చోరీ జరిగిన విల్లాలను పరిశీలించిన పోలీసులు.. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.

రెండు రోజులుగా రెక్కీ...
ఈ చోరీ ముఠా రెండు రోజులుగా కాలనీలు, విల్లాలల్లో రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఆరుగురు సభ్యుల ఈ ముఠా ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్లమంటూ కాలనీలలో తిరుగుతూ వీడియో తీసినట్టు కాలనీలు, విల్లాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీల్లో రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. తమను ఎవరైనా పట్టుకొనేందుకు యత్నిస్తే దాడి చేసేందుకు దొంగలు రాళ్లు వెంట పెట్టుకొని తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.  శనివారం బాలాజీ నగర్‌లోని ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడిన ముఠానే ఇక్కడ కూడా దొంగతనాలకు పాల్పడి ఉండవచ్చని సీఐ కుషాల్‌కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు