ఒప్పందాలు అమలు చేయాల్సిందే

30 Apr, 2017 22:22 IST|Sakshi
ఒప్పందాలు అమలు చేయాల్సిందే
ఏలూరు (మెట్రో): ఆయిల్‌ కంపెనీలు డీలర్లకు ఇచ్చిన రాతపూర్వక హామీ ప్రకారం 11 ఒప్పందాలను తక్షణమే అమలు చేసి పెట్రోల్, డీజిల్‌ డీలర్లను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పెట్రోల్‌ అండ్‌ డీజిల్‌ డీలర్ల అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఏలూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ పెట్రోల్, డీజిల్‌ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోలియం డీలర్లు 365 రోజులు, 24 గంటలు పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌ 4న ఆయిల్‌ కంపెనీలు రాతపూర్వకంగా రాసిచ్చిన నిర్ణయాలను కూడా అమలు చేయకుండా ఒప్పందాలను అగౌరపరిచాయన్నారు. ఈ నిర్ణయాలు అమలు చేసేందుకు మార్చి 9న ఢిల్లీలో సమావేశమై మరో రెండు నెలలు సమయం కావాలని కోరారని, రెండు నెలల సమయం ఇచ్చినా అమలు చేయలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో డీలర్లకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగని రీతిలో ఖర్చులను తగ్గించుకునే విధంగా షిప్ట్‌ విధానాలను అమలు చేసేందుకు నిర్ణయిస్తున్నట్టు చెప్పారు. తక్షణమే 11 ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
10 నుంచి ఉద్యమం
ఆయిల్‌ కంపెనీలు ఒప్పందాలను అమలు చేయకుంటే ఈ నెల 10 నుంచి శాంతియుతంగా ఉద్యమిస్తామని గోపాలకృష్ణ చెప్పారు. కొనుగోళ్లు నిలిపేసి మొదటి విడతగా నిరసన తెలుపుతామన్నారు. అదే విధంగా 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంకులు పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 14 నుంచి ఆదివారం సెలవు దినంగా ప్రకటించనున్నట్టు చెప్పారు. తక్షణమే ఆయిల్‌ కంపెనీలు స్పందించి అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేస్తూ, 11 ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. ఈనెల 10 నుంచి నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు గమిని రాజా, కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు టి.సూర్యనారాయణరెడ్డి, ట్రెజరర్‌ కె.అంజిబాబు, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్, నాయకులు శేఖర్‌ పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు