గోవుల గొప్పదనం ప్రపంచం గుర్తిస్తోంది

12 Dec, 2016 15:16 IST|Sakshi
గోవుల గొప్పదనం ప్రపంచం గుర్తిస్తోంది
హంగేరి ప్రాంత శ్రీకృష్ణ మందిర్‌ ప్రతినిధి లకతోష్‌ లాస్లో
గోశాలను సందర్శించిన యూరఫ్‌ దేశస్తులు
గోవులతో మమేకం
అమలాపురం టౌన్‌ :  గోవుల్లో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన శక్తిని భారతీయ సంస్కృతి మాత్రమే గుర్తించిందని యూరఫ్‌ దేశం హంగేరి ప్రాంత అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిర్‌ ప్రతినిధి లకతోష్‌ లాస్లో (బ్రజా ప్రభు– దీక్షా నామం) తెలిపారు. గోవుల గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు క్రమేపీ గుర్తిస్తున్నాయని చెప్పారు. అమలాపురంలోని గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలను లాస్లో తన కుంటుంబంతో కలసి బుధవారం సందర్శించారు. ఆయన సతీమణి డొమె బిట్రిక్స్‌ (గోవింద ప్రియదాసి), వారి కుమార్తె డొమె జూలియట్‌ (రాధారాణి) ఉదయం నుంచి సాయంత్రం వరకూ గోవులతో మమేకమయ్యారు. ఎనిమిదేళ్ల జూలియట్‌ గోశాలలోని ఆవు దూడలు, పెంపుడు కుక్కలతో ఆటలాడుకుంది. వీరు యూరఫ్‌లో అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిర్‌ సంస్థ హంగేరి ప్రాంత ప్రతినిధి కుటుంబంగా ఉంటోంది. వారికి ఆ దేశ పేర్లు ఉన్నప్పటికీ శ్రీ కృష్ణ దీక్షా నామాలు కూడా పెట్టుకోవడం ఆ సంస్థలో సంప్రదాయం.
గో సేవకులతో లాస్లో కుటుంబం మాట్లాడింది. ఈ సందర్భంగా జరిగిన ఇష్టాగోష్ఠిలో గోవుల గొప్పదనం గురించి ప్రసంగించారు. భవిష్యత్‌లో గోవుల విశిష్టత, పవిత్రత ప్రపంచంలోని అన్ని దేశాలు ఆమోదించే పరిస్థితులు వస్తాయని చెప్పారు. గో సన్నిధిలో ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యూరఫ్‌లో కూడా తాము గోవుల విశిష్టత గురించి అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిర్‌ ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, కనకదుర్గ దంపతులు  గోవులకు ఇక్కడి ప్రజలు ఇచ్చే గౌరవాన్ని, విలువను తెలియజేశారు. 
నేడు గోపూజ, గో హారతి 
లాస్లో దంపతులు గురువారం ఉదయం 10 గంటలకు గోపూజ, గో హారతి నిర్వహిస్తారు. విదేశీ దంపతులు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని గోశాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
>
మరిన్ని వార్తలు