ఖైదీలు సత్ప్రర్తనతో మెలగాలి

2 Oct, 2016 22:50 IST|Sakshi
గాంధీజీకి నివాళులర్పించి, ఖైదీలనుద్దేశించి మాట్లాడుతున్న జడ్జి రాధాక్రిష్ణ కృపాసాగర్‌

 

  • జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి  రాధాక్రిష్ణ కృపాసాగర్‌

ఖమ్మం రూరల్‌: ప్రతి మనిషి తప్పు చేయడం సహజమని, దానిని (తప్పును) పునరావృతం కాకుండా చూసుకున్నప్పుడే జీవితంలో రాణిస్తారని జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి రాధాక్రిష్ణ కృపాసాగర్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దానవాయిగూడెంలోని జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా జడ్జి పాల్గొన్నారు. జైలు ఆవరణలోగల గాంధీ విగ్రహానికి జడ్జితోపాటు ఎస్పీ షానవాజ్‌ ఖాసీం పూలమాల వేశారు. కొద్దిసేపటి తరువాత ఎస్పీ వెళ్లిపోయారు. ఖైదీలనుద్దేశించి జడ్జి మాట్లాడుతూ.. ఒకసారి తప్పు చేసి జైలుకు వచ్చిన వారు, తిరిగి ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. తప్పును తెలుసుకుని ప్రవర్తన మార్చుకున్నప్పుడే మనిషికి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా ఉండాలన్నారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీలు సత్వర న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. బెయిల్‌ కోసం ఆర్థిక స్థోమత లేని వారికి లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ తరఫున ఉచితంగా లాయర్లను నియమిస్తామన్నారు.
    ఏఎస్‌పీ భాస్కరన్‌ మాట్లాడుతూ.. ఎవరైనా తప్పు చేసే ముందు తమ కుటుంబ పరిస్థితిని, జైలుకు వెళితే ఏర్పడే పర్యవసానాలను ఆలోచించాలని కోరారు.
    డీఎస్‌పీ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నతనంలోనే చెడు మార్గం పట్టినవారు జైలుకు వస్తున్నారని అన్నారు. ఖైదీలంతా చదువుకుని సన్మార్గంలో పయనించడమే.. గాంధీజీకి  ఇచ్చే మొదటి బహుమతని అన్నారు.
    జైలు çసూపరింటెండెంట్‌ కళాసాగర్‌ మాట్లాడుతూ.. తమ జైలులో 340 మంది ఖైదీలు ఉండేందుకు అవకాశముందన్నారు. ఇక్కడి ఖైదీలు కూరగాయ పంటలు పండిస్తున్నారని, హరితహారం కింద జైలు ఆవరణలో నాటిన 30వేల మొక్కలను సంరక్షిస్తున్నారని చెప్పారు. వీరికి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. సత్ప్రర్తన కలిగిన ఖైదీల కుటుంబాలకు స్వయం ఉపా«ధి కోసం వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తున్నట్టు చెప్పారు. సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీలను జైలు ఆవరణలోని పెట్రోల్‌ బంక్‌లో వేతనంపై నియమిస్తున్నట్టు చెప్పారు. ఖైదీలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను జడ్జి, ఏఎస్‌పీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ రాంచంద్రన్, డీఆర్‌ఓ శ్రీనివాస్, జైలర్‌ డి.రతన్ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు