ఏదీ ఆ తాకిడి!

13 Aug, 2016 20:29 IST|Sakshi
ఏదీ ఆ తాకిడి!
* తొలిరోజు స్వల్పంగా భక్తుల రాక
*  తెల్లవారుజాము నుంచే స్నానాలు
*  వెలవెలబోయిన క్యూలైన్లు
 
సాక్షి, అమరావతి : అమరావతిలో కృష్ణా పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే శుక్రవారం ఉదయం 5.44 గంటలకు అమరేశ్వరుని ఘాట్‌లో పూజలు నిర్వహించి, అమరావతిలో పుష్కర స్నానాలను ప్రారంభించారు. ధ్యానబుద్ధ ఘాట్‌లో కృష్ణవేణి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రత్యేక పూజలు చేశారు.తెల్లవారుజామునే పుష్కర స్నానాలు చేయాలన్న ఆక్షాంక్షతో చేరుకున్న భక్తులు కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. మహిళలు కృష్ణమ్మకు సారె, చీరె, పసుపు, కుంకుమ సమర్పించి కృష్ణవేణి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేశారు. 
 
తొలిరోజే వెలవెల..
కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల తాకిడి తక్కువగా ఉండటంతో ఘాట్‌లతో పాటు, ఏర్పాటు చేసిన క్యూలైన్లు వెలవెలబోయాయి. మధ్యాహ్న సమయానికి భక్తులు పూర్తిగా పలుచబడ్డారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు, వరలక్ష్మీ పూజలు నిర్వహిస్తారని అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలు తలకిందులయ్యాయి. గుంటూరు జిల్లాలోని ఘాట్‌ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానికులు తప్ప, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అంతంతమాత్రమే. అధికారులు తెల్లవారుజాము నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు ఘాట్‌ల వద్దనే ఉండి సమీక్షలు చేశారు. శివరాత్రి పర్వదినాల్లో వచ్చే భక్తుల స్థాయిలో కూడా తొలిరోజు భక్తులు కనిపించలేదు. నదిలో నీళ్లు తక్కువగా ఉండటం, ఘాట్‌ నిర్మాణాలు పూర్తికాకపోవడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 
 
దాతల స్పందన...
దారి వెంబడి గ్రామాల ప్రజలు ఉచిత అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకు వేడి పాలు, పెద్దలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు రోడ్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పుష్కర నగర్‌లలో భోజనాలు ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా భక్తులు రాలేదు. దీనికితోడు అమరావతిలో 8 ప్రాంతాల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు.
 
మరిన్ని వార్తలు