పథకం ప్రకారమే దీనజ్యోతి హత్య!

11 Nov, 2016 00:38 IST|Sakshi
పథకం ప్రకారమే దీనజ్యోతి హత్య!

కడప అర్బన్‌ : కడప రాజారెడ్డివీధికి చెందిన రిటైర్డ్‌ ఏఎస్‌డబ్లు్యఓ దీనజ్యోతి (62)ను దారుణంగా పథకం ప్రకారమే హత్య చేశారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే ప్రాంతంలో బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు, తన దగ్గర పనిచేస్తున్న పనిమనిషి భర్త, అతని స్నేహితునితో కలిసి పక్కా ప్రణాళికతో దీనజ్యోతిని అంతమొందించారని తెలిసింది. బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలికి, దీనజ్యోతికి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగాయి. మరికొంత మొత్తంలో డబ్బును తన అవసరాలకు ఇవ్వాలని బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు దీనజ్యోతిని కోరింది. ససేమిరా అనడంతో ఆమె బంగారు ఆభరణాలపై నిందితురాలు కన్నేసింది. ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు తన దగ్గర పనిచేస్తున్న పని మనిషి భర్తకు డబ్బు ఆశ చూపి దీనజ్యోతిని హత్య చేసే విషయంలో సహాయం కోరింది. ఈ విషయాలన్నీ పనిమనిషి భర్తతో ప్రధాన నిందితురాలైన బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు గంటల తరబడి రాత్రి వేళల్లో ముఖ్యంగా దీనజ్యోతి అదృశ్యం కావడానికి ముందుగా రెండు రోజులు చర్చించింది. తర్వాత అనుకున్న సమయానికి దీనజ్యోతి ఇంటి నుంచి ఫేషియల్‌ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. చివరి ఫోన్‌కాల్‌ దీనజ్యోతి బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలితోనే మాట్లాడినట్లు సమాచారం. తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయబడింది. దీనజ్యోతి ఫేషియల్‌ చేయించుకునేందుకు రాగానే ఆమెను కుర్చీలో కూర్చొబెట్టారు. ఫేషియల్‌ చేసిన అనంతరం పథకం ప్రకారం పనిమనిషి భర్త , ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు, ఇందుకు బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు సహకరించినట్లు తెలుస్తోంది. తర్వాత సాయంత్రం వరకు ఎదురుచూసి మృతదేహాన్ని పని మనిషి భర్త స్నేహితుడు, ఆటో డ్రైవర్‌ సహాయంతో నగర శివార్లలోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అప్పటికే ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను కాజేసినట్లుగా తెలుస్తోంది. సదరు బంగారు ఆభరణాలలో కొన్నింటిని బీకేఎం వీధిలోని ఓ సేఠ్‌ వద్ద కుదవకు పెట్టిన పనిమనిషి భర్త, ఆటో డ్రైవర్‌లు ఆ డబ్బుతో తమ అవసరాలను తీర్చుకున్నారు. దీన జ్యోతికి, బ్యూటీ పార్లర్‌ నిర్వాహకురాలు మధ్య లావాదేవీలతో మనస్పర్థలు ఏర్పడడంతో దారుణ హత్యకు దారి తీసిందని అనుకుంటున్నారు. ఇప్పటికే నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనజ్యోతి మృతదేహానికి నగర శివార్లలో తగులబెట్టబడిన మృతదేహం ఒకటేనా? కాదా? అనే విషయంపై స్పష్టత వస్తే మిస్టరీ వీడిపోతుంది. ఈ సంఘటనపై మహిళా అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ వాసుదేవన్‌ మాట్లాడుతూదీన జ్యోతి వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉందని, నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టామని తెలిపారు.

మరిన్ని వార్తలు