-

చుక్కనీరు లేని లక్ష్మాపూర్‌ చెరువు

24 Sep, 2016 18:30 IST|Sakshi
నీరు చేరని లక్ష్మాపూర్ ఊర చెరువు

చెరువు నీటిని పుష్పాలవాగు మళ్లించిన అధికారులు
సాగుకు నీరు కరువు.. రైతుల ఇబ్బందులు

రామాయంపేట: భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగి పొర్లుతుంటే మండలంలోని లక్ష్మాపూర్‌ చెరువుకు మాత్రం చుక్క నీరు చేరలేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం... గ్రామాన్ని ఆనుకునే ఊర చెరువు ఉంది. ఇందులో నీరు నిలిస్తే ఈ గ్రామంతోపాటు  చుట్టుపక్కల మరో నాలుగైదు గ్రామాల్లో నీటి ఎద్దడి తీరుతుంది.

గతంలో చిన్నపాటి చినుకులు కురిసినా అటవీప్రాంతంలో నుంచి వరద నీరు చెరువులోకి చేరేది. ఈచెరువు నిండితే  రెండు పంటలు పండేవని గ్రామస్తులు తెలిపారు. కాగా అటవీప్రాంతంలో ఉన్న జోగయ్య ఓర్రె కాలువను పుష్పాలవాగులోకి మళ్లించడంతో ఈ చెరువులోకి చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో చుక్కనీరు లేక లక్ష్మాపూర్‌ చెరువు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొద్దిపాటి నీరు మాత్రమే వచ్చింది.

దీనికితోడు చెరువులోకి వరద నీరు వచ్చే కాలువలు సైతం పూడుకుపోయాయి. దీనితో గ్రామస్తులు  పంటలు ఎలా పండిచుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈచెరువులోకి నీరు చేరకపోతే తాము అన్ని విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని అటవీప్రాంతంలోని బోగయ్య ఓర్రె నీటిని తమ చెరువులోకి మళ్లించాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు.

మాకు అన్యాయం
వానతో అన్ని గ్రామాల చెరువులు నిండినాయి. మా ఊర చెరువుకు మాత్రం నీరు రాలేదు. ఈచెరువు నిండితేనే మేం బతికేది. చెరువులో నీరు రాకపోతే మాకు తాగెటందుకు కూడా నీళ్లు దొరకవు. సర్కారు వెంటనే ఆదుకొని కాలువలు తీయించి ఆదుకోవాలి.- అనుముల లక్ష్మి, మహిళా రైతు

జోగయ్య ఒర్రెతోనే సమస్య పరిష్కారం
గతంలో జొగయ్య ఒర్రె నీళ్లు కాలువ ద్వారా చెరువులోకి వచ్చేవి. దీనితో రెండు, మూడు వానలకే  చెరువు నిండేది. ఈ ఒవొర్రెను  పుష్పావాగుకు మళ్లించడంతో మాకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం ఎంత పెద్ద వానలు పడిన చెరువులకు చుక్కనీరు వస్తలేవు. వెంటనే జోగయ్య ఒర్రె కాలువను చెరువులోకి మళ్లించి తమను ఆదుకోవాలి. - చింత పోచయ్య, రైతు

మరిన్ని వార్తలు