నిలిచిన ఎండుకొబ్బరి తయారీ

12 Feb, 2017 23:06 IST|Sakshi
నిలిచిన ఎండుకొబ్బరి తయారీ
కొబ్బరి ధర పెరుగుదల రైతులకు సంతోషాన్ని ఇస్తుంటే..  కొబ్బరి కార్మికులకు,  తయారీ కొబ్బరి వ్యాపారులను మాత్రం కష్టాల్లోకి నెట్టుతోంది. పచ్చికొబ్బరి కాయ ధర పెరగడంతో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి).. కొబ్బరినూనె తయారీ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఇటు వ్యాపారులకు... అటు కార్మికులకు చేతిలో పనిలేకుండా పోతోంది.
– అమలాపురం/అంబాజీపేట
ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చికాయ, ముక్కుడు కాయ వెయ్యి కాయల ధర రూ.7,500 వేల వరకూ ఉంది. పది, పదిహేను రోజుల క్రితం రూ.పది వేలు ఈ ధర పలికింది. కాయ ధర ఎక్కువగా ఉండడంతో రైతులు, కొబ్బరి వ్యాపారులు నేరుగా కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత ధరకు కొనుగోలు చేసి.. తయారీ కొబ్బరి (కొత్తకొబ్బరి, ఎండుకొబ్బరి)ని స్థానికంగా తయారుచేసే అవకాశం లేదు. తయారీ కొబ్బరి కన్నా పచ్చికొబ్బరి ధర ఎక్కువగా ఉంది. తయారీ కొబ్బరి క్వింటాల్‌ ధర రూ.8 వేలు ఉండగా, పచ్చికొబ్బరి ధర రూ.7,500లే ఉంది.  
ఎండు కొబ్బరి చేస్తే నష్టమే..
వెయ్యి కొబ్బరికాయల నుంచి 90 కేజీల ఎండు కొబ్బరి తయారవుతుంది. క్వింటాల్‌ ఎండుకొబ్బరి తయారు చేయాలంటే 1,110 కాయలు అవసరం. మార్కెట్‌ ధరను బట్టి చేస్తే అయ్యే ఖర్చు రూ.8,325. వలుపు, తయారీ కార్మికులకు, రవాణా ఖర్చులు కలుపుకుంటే క్వింటాల్‌ ఎండు కొబ్బరి ఉత్పత్తికి అయ్చే ఖర్చు రూ.వెయ్యికిపైనే. అంటే క్వింటాల్‌ ఎండుకొబ్బరి తయారీ పెట్టుబడి రూ.9,500ల వరకూ అవుతున్నట్టు లెక్క. మార్కెట్‌ ధర మాత్రం రూ.8,200లే. దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలను వేలంలో పొందినవారే ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. సీజ¯ŒSలో అంబాజీపేట మార్కెట్‌ నుంచి ఇప్పుడు 10 టన్నులు కూడా ఎగుమతి కావడం లేదు. 
ఉపాధి కోల్పోయిన కార్మికులు 
పచ్చికొబ్బరి ఎగుమతి కన్నా ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఎగుమతులపైనే అంబాజీపేట మార్కెట్‌లో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 3 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు. 
నిండా ముంచేస్తున్న వ్యాపారులు
తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా నిల్వ చేసిన వ్యాపారులు ఇప్పుడు ఎగుమతి చేసే పనిలో పడ్డారు. నిల్వలు పూర్తయ్యేవరకూ ధర తగ్గించేశారని రైతుల ఆరోపణ. నిల్వలు పూర్తయ్యాకా తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసి, తరువాత ధరలు పెంచి లాభపడాలనే వ్యాపారుల వ్యూహానికి  బలవుతున్నామని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు మాత్రం ధర పెరిగిన తరువాత అమ్మకాలు చేయాలని కొబ్బరికాయలను నిల్వ చేస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు