మద్యం మీరే అమ్ముతుంటే..

20 Nov, 2016 04:01 IST|Sakshi
మద్యం మీరే అమ్ముతుంటే..

మేమెలా మాన్పించగలమని చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు
- డ్వాక్రా రుణమాఫీ జరగలేదంటూ ప్రశ్నించిన మహిళ
- ఏయ్.. ఎన్నిసార్లు చెప్పాలి..అందరికీ ఇచ్చేశామంటూ సీఎం ఆగ్రహం
- మహిళల ఆందోళనను పట్టించుకోకుండా ఉపన్యాసం కొనసాగింపు
 
 సాక్షి, రాజమహేంద్రవరం: ‘మద్యం వల్ల అనేక సమస్యలున్నాయంటున్నారు. మగాళ్ల చేత ఆడవాళ్లే మద్యం తాగడం మాన్పిం చాలని చెబుతున్నారు. మద్యం దుకాణాలకు లెసైన్‌‌సలు ఇచ్చి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంటే తాగకుండా ఎలా ఉంటారు? మీరు ఊరూరా బెల్టు షాపులు పెడుతుంటే మేమెలా మాన్పించాలి?’ అంటూ డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. జనచైతన్య యాత్ర, డ్వాక్రా సదస్సు, పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించడం కుటుంబానికి పెద్ద దెబ్బని, మగాళ్లు సారా తాగడానికి మహిళలు డబ్బులు ఇవ్వకూడదని చెప్పారు. మద్యం సేవించకుం డా మహిళలు మగాళ్లలో చైతన్యం తేవాలని చెబుతుండగా... ప్రభుత్వమే మద్యం అమ్ముతుంటే మగాళ్లు తాగకుండా తామెలా అడ్డుకోగలమని మహిళలు పెద్దపెట్టున కేకలు వేశారు. ఊరూరా బెల్టు షాపులు పెడుతూ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 డ్వాక్రా రుణాలు రద్దు కాలేదు
 అలాగే డ్వాక్రా రుణాలు రద్దు కాలేదంటూ మహిళలు సీఎంను నిలదీశారు. ’సారూ మీరు చెప్పినట్లు మాకు రుణ మాఫీ కాలేదు. మూడు విడతలుగా రూ.10 వేలు ఇస్తామన్నారు. మొదటి విడతగా రూ.3 వేలు అకౌంట్లో వేశామన్నారు. కానీ మాకు రాలేదు. మా సంగతేంటి సారూ’ అంటూ ఓ మహిళ ప్రశ్నించింది. దీంతో ముఖ్యమంత్రి ఆమెపై చిందులు తొక్కారు. ’ఏయ్.. ఊరుకో.. ఎన్నిసార్లు చెప్పాలి. అందరికీ మూడు వేలిచ్చాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి నిధి కింద ఇచ్చే రూ.10 వేలలో రెండో విడత రూ.3వేలకు సంబంధించిన చెక్కులు సభలో ఇస్తామని తమను పిలిపించారని, సభకు రాకపోతే ఆ నగదు రాదని చెప్పడంతో వచ్చామని డ్వాక్రా మహిళలు చెప్పారు. మొదటిసారి ఇచ్చామని చెబుతున్నా రూ.3 వేలు కూడా తమకు రాలేదని తెలిపారు. తాము దాచుకున్న పొదుపు డబ్బులు కూడా రుణాల వడ్డీకి జమేసుకుంటున్నారని వాపోయారు. రుణాలు కడితే మాఫీ చేస్తామని చెప్పడంతో కట్టామని, వారుుదాలు తీరినా ఇంకా ఐదు నెలలు చెల్లించాలని చెబుతుండడంతో ఏం చేయాలో తెలియడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అరుుతే మహిళల ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రంలో ఉన్న 90 లక్షల డ్వాక్రా సంఘాల సభ్యులు తమ కుటుంబాలకు ఆర్థిక చేయూతనిస్తు ్తన్నారని అభినందించారు. చదువుకున్నవారు, ఉద్యోగులు సంతానం లేకపోతేనే సంతోషం గా ఉంటామని భావిస్తుండడంతో జనాభా కొరత వస్తోందన్నారు. జనాభా కొరత రాకుండా పిల్లలను కనాలని పిలుపునిచ్చారు.

 పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తున్నా...
 రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దును సమర్థిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజకీయాల్లో అవినీతి పోవాలంటే పెద్దనోట్ల రద్దు ఒక్కటే మార్గమన్నారు. భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీల కోసం కై జాలా యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు తక్కువ ధరలకే అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, రాజధాని పనుల్లో అవినీతి జరుగుతుందంటూ కొందరు ఆరోపిస్తూ కోర్టులకు వెళుతున్నారని, అక్కడేమీ జరగదని చెప్పారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.  కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
 
 డ్వాక్రా మహిళల అభిప్రాయాలు


 ఒక్క రూపాయి రాలేదు..
 ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున మూడు లక్షల లోను తీసుకున్నాం. రుణమాఫీ చేస్తామన్నారు.. చేయలేదు. వారుుదాలు కట్టండి ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఇస్తామన్నారు. వారుుదాలు కడుతున్నా మా ఖాతాల్లో మొదటి విడత రూ.3 వేలు జమకాలేదు. సీఎంను అడుగుతుంటే అధికారులు తోసేస్తున్నారు. ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి?.
 - కె.వీరవేణి, పార్వతి గ్రూపు, కొంతమూరు, రాజమహేంద్రవరం రూరల్

 మద్యం అమ్ముతుంటే తాగకుండా ఎలా ఉంటారు?
 ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టి అమ్ముతుంటే మగాళ్లను ఎలా అడ్డుకోగలం? తాగకుండా ఉండాలంటే మద్యం దుకాణాలను రద్దు చేయాలి. మేము సంపాదించిన సొమ్ము మగాళ్లు తాగుడుకు తగలేస్తున్నారు.
 - ఆరె సత్యవతి, శ్రీరామపురం, రాజానగరం నియోజకవర్గం

మరిన్ని వార్తలు