ఎంసెట్‌ ‘తీన్‌’మార్‌

11 Sep, 2016 23:25 IST|Sakshi
ఖమ్మంలో ఎంసెట్‌–3 పరీక్ష రాస్తున్న విద్యార్థులు
  •  హాజరైన 1,499 మంది విద్యార్థులు
  •  ప్రతి సెంటర్లో పోలీసు బందోబస్తు
  •  చివరి నిమిషంలో ఉరకలు పరుగులు
  • ఖమ్మం: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన ఎంసెట్‌–3 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని మొత్తం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,172 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,499 మంది హాజరయ్యారని, 673 మంది గైర్హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్‌ పుష్పలత వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్‌–2 రదై్దన నేపథ్యంలో ఎంసెట్‌–3కి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం డీఎస్పీ సురేష్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసులు బందోబస్తును కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి లోనికి పంపించారు. పరీక్ష నిర్వహణ తీరును జేఎన్‌టీయూ అధికారులతో పాటు జిల్లా కోఆర్డినేటర్‌ పర్యవేక్షించారు. 
    – ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల–1 సెంటర్‌కు 550 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 386 మంది హాజరయ్యారు. 164 మంది గైర్హాజరయ్యారు. 
    – ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల–2 సెంటర్‌కు 550 మంది గాను 391 మంది హాజరయ్యారు. 159 మంది గైర్హాజరయ్యారు. 
    – ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెంటర్‌లో 675 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 452 మంది మాత్రమే రాశారు. 223 మంది పరీక్షకు హాజరుకాలేదు. 
    – యూనివర్సిటీ పీజీ కళాశాల సెంటర్‌లో 397 మందికి 270 హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు.
    – పలువురు అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తూ కనిపించారు. పరీక్ష కేంద్రాల విషయంలో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇల్లెందు పట్టణానికి చెందిన లావణ్య అనే అభ్యర్థిని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల అనుకొని, యూనివర్సిటీ కళాశాలకు వెళ్లింది. తీరా హాల్‌టికెట్‌ చూసే సరికి పొరపాటును గుర్తించింది. తిరిగి తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి రాబోయే సరికి అప్పటికే ఆలస్యం కావడంతో అనుమతించలేదు. 
    – హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్, అటెస్టేషన్‌ కోసం పలువురు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 
    – తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు దైర్యంనూరి పోసి పరీక్ష హాల్‌కు పంపించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి వారిని తోడ్కొని వెళ్లారు. 
     
     
మరిన్ని వార్తలు