ఈ సారైనా పరిహారం అందేనా?

29 Sep, 2016 10:03 IST|Sakshi
పంటనష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు

గతేడాది 2.72 లక్షల హెక్టార్లలో పంట నష్టం
నేటికీ అందని ఇన్‌పుట్‌ సబ్సిడీ
ఈ ఏడు అతివృష్టితో భారీగా పంటనష్టం

మెదక్‌: రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన  రైతులు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. గతేడాది తీవ్ర కరువుతో నష్టపోయిన రైతులకు నేటికి పైసా పరిహారం అందలేదు. ఈ యేడు అనేక నష్టాలకోర్చి సాగు చేసిన కొద్దిపాటి పంటలు చేతికందే సమయంలో అతివృష్టితో కొట్టుకుపోయాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.

మెదక్‌ జిల్లాలో గత సంవత్సరం తీవ్రకరువు కారణంగా  అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షల 73 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, సోయాబిన్‌ తదితర పంటలు ఎండి పోయాయి. దీంతో జిల్లా రైతాంగానికి రూ. 197.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులే లెక్కలు కట్టారు. కాగా  నేటికి యేడాది గడిచిపోతున్నా రైతులకు పైసా పరిహారం (ఇన్‌పుట్‌) సబ్సిడీ అందలేదు. 

గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులు బతుకు దెరవు కోసం  పట్టణాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఈ యేడు ఖరీఫ్‌లో మళ్లీ పంటలు సాగు చేసేందుకు పల్లెటూర్లకు  చేరుకున్నారు. ఖరీఫ్‌ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మెట్టప్రాంతాల్లో మొక్కజొన్న  సాగు చేయగా కొద్దో, గొప్పో నీరువచ్చే బోరుబావుల ఆధారంగా వరి, సోయాబిన్‌లాంటి పంటలను 3.5 లక్షల హెక్టార్లలో సాగు చేశారు.

అయితే ముందు మురిపించిన వర్షాలకు మొక్కజొన్న ఏపుగా ఎదిగినా గింజదశకు వచ్చిన ఆగస్టు నెలలో చుక్కవర్షం పడలేదు. దీంతో వర్షాధార పంటలైన మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి. కాగా బోరుబావుల ఆధారంగా సాగు చేసిన వరి ఇటీవల కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగి కొట్టుకుపోయింది. దీంతో సుమారు లక్ష ఎకరాలల్లో  పంట దెబ్బతినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

ఇంకా పలు మండలాల్లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటనష్టం వివరాలను సేకరిస్తున్నారు. కాగా గతేడాది అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులకు నేటికి పైసా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. కనీసం ఈ సారైనా సకాలంలో బాధితరైతులకు పరిహారం ఇస్తారో లేదో అంటూ  పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వరుస విపత్తులతో  సర్వస్వం  కోల్పోయిన  తమను ఆదుకోవాలని  రైతులు కోరుతున్నారు.

గతేడాది కూడా పరిహారం ఇవ్వలేదు
గతేడాది మూడెకరాల్లో మొక్కజొన్న వేశా. వర్షాలు పడక పంట ఎండిపోయింది. అధికారులు వచ్చి రాసుకు పోయారు. కాని నేటికీ పరిహారం అందలేదు. ఈయేడు కూడా మొక్కజొన్న  వేయగా అది ఎండిపోయాక వర్షం పడింది. ఈయేడైనా పరిహారం అందిస్తారో లేదో? - కెతావత్‌ శ్రీను, బ్యాతోల్‌తండా

మరిన్ని వార్తలు