పాపాల గుట్టు రట్టు

5 Jul, 2016 10:41 IST|Sakshi
పాపాల గుట్టు రట్టు

సాక్ష్యాలతో పట్టుకున్న పోలీసులు
సామగ్రి స్వాధీనం... అదుపులో నిందితుడు

 అశ్వారావుపేట  : పాలు.. తాగడమంటే ఎవరికైనా ఇష్టమే. విటమిన్లు ఉంటాయని.. అందరూ తాగొచ్చని వైద్యులు సలహాలు సూచనలు చేస్తారు.. కానీ.. ఇక్కడి పాలు తాగిన వారు డబ్బులిచ్చి చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లే.. యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో ఏళ్ల తరబడి కుటీర పరిశ్రమలా నడుస్తున్న నకిలీ పాల గుట్టు రట్టు  కావడంతో ఊరి జనమంతా ఇదెక్కడి దందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాల సేకరణ వ్యాపారి ఇంట్లో ఏళ్ల తరబడి గుట్టుగా నిర్వహిస్తున్న నకిలీ పాల తయారీ యంత్రాన్ని అశ్వారాపుపేట, దమ్మపేట పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. నిర్వాహకుడు పాలను సృష్టిస్తుండగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. అచ్యుతాపురం, నారంవారిగూడెం గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువ. ఇక్కడి నుంచి చాలా మంది పాలను సేకరించి.. ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఇదే వ్యాపారం చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన వేజల మురళి ఇంటి ముందు దమ్మపేట ఎస్సై నాగరాజు, అశ్వారావుపేట పీఎస్సై వెంకన్న, ఏఎస్సై కోటేశ్వరరావు, రెండు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది తెల్లవారేసరికి ఉన్నారు. దీంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. తీరా అతగాడే నకిలీ పాలు తయారు చేస్తున్నాడని తెలిసి నిర్ఘాంతపోయారు.

క్షణాల్లో పాల తయారీ..
విష పదార్థాలేమీ లేకుండా యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేస్తున్నాడు. లీటరు నూనె, కిలో యూరియా, లీటరు నీళ్లు, పావుకిలో పంచదార, పావుకిలో పాలపిండి కలిపి సరిపడా నీళ్లు పోసి అన్నింటినీ ఒకే మిశ్రమంగా పాల సేకరణ డ్రమ్ములో కలుపుతున్నాడు. తర్వాత విద్యుత్ మోటార్‌కు అమర్చిన కవ్వంతో చిలుకుతున్నాడు. డ్రమ్ముపై మూత గట్టిగా ఉండటంతో చుక్క కూడా బయట పడకుండా మిశ్రమం అంతా మదించబడి పాలవంటి పదార్థం పైకి తేలుతుంది. దీనిని సేకరించిన పాలలో కలిపి పాల సేకరణ కేంద్రాలకు విక్రయిస్తున్నాడు. పాలలోని వెన్న శాతాన్నిబట్టి ప్రైవేటు కంపెనీలు లీటరుకు రూ.70 వరకు చెల్లిస్తుండటంతో.. రూ.100 పెట్టుబడితోనే రూ.వెయ్యి విలువైన పాలవ ంటి మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు.

సేకరణ కేంద్రాల నుంచి పసిపిల్లల దాకా..
పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, కుడితి, పశువు, పొదుగు లేకుండా ఎరువు, వంటనూనెతో తయారు చేసిన నకిలీ పాలను అశ్వారావుపేట, దమ్మపేటలోని హెరిటేట్, మోడల్ డెయిరీలకు విక్రయిస్తుంటాడు. ఇతడితోపాటు ఇటువంటి పాల తయారీదారులు అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు విక్రయించిన నకిలీ పాలు పాల శీతలీకరణ కేంద్రాల గుండా మిల్క్ చిల్లింగ్ సెంటర్లకు తరలిస్తారు. ఇక్కడి నుంచి పలు పరిమాణాల్లో ప్యాకెట్ల రూపంలో ఐఎస్‌ఓ స్టాండర్డ్‌లతో విక్రయిస్తుంటారు. కొనే పాల ప్యాకెట్‌లో విషం పసిపాపల నుంచి వృద్ధుల వరకు ప్రభావాన్ని చూపుతోందని నిర్వాహకుడు చెప్పేదాన్నిబట్టి తెలుస్తోంది. 

శాస్త్రం తెలిసిన వ్యక్తే ఆద్యుడు..
అశ్వారావుపేటలోని మోడల్ డెయిరీలో గతంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ టెక్నాలజీని పరిచయం చేసినట్లు చెబుతున్నాడు మురళి. పాల లో వెన్న శాతం అధికంగా రావాలంటే.. పాలు అధికంగా ఉండాలంటే ఇలా నూనె, ఎరువులు కలిపితే లాభాలు వస్తాయని చెప్పినట్లు చెబుతున్నాడు. ఆఫ్ హెచ్‌పీ మోటార్, ప్లాస్టిక్ కవ్వం, కలిపే విధానం, టెక్నాలజీని నేర్పినందుకు రూ.35వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. పాల తయారీకి వాడిన నూనె ప్యాకెట్లను ఎప్పటికప్పుడు ఇంటి ఆవరణలోనే తగుల బెడుతున్నాడు.

అంతేకాక గ్రామంలో ఎవరితోనూ వివాదం లేకుండా అమాయకుడిలా కనిపించే మురళి ఇలా చేయడం గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తోంది. పాలు కొనేందుకు ఎవరయినా వచ్చినా.. ఇంటిలో నుంచి తడికదాకా వచ్చి పాలు పోసే వాడని.. తీరా పోలీసులు వచ్చాక మోసం బయటపడిందని గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ైరె తుల నుంచి రోజుకు 40 లీటర్ల పాలు సేకరించి.. తర్వాత 450 లీటర్ల పాలు విక్రయించడంపై గ్రామస్తులకు వచ్చిన అనుమానంతో గుట్టు పాల తయారీకి వాడిన 80 నూనె ప్యాకెట్లు, 8 డ్రమ్ములు, 20 కిలోల యూరియా, పాలపిండి, పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు