ప్రాణాలతో ‘ఉపాధి’ చెలగాటం

5 May, 2017 23:34 IST|Sakshi
ప్రాణాలతో ‘ఉపాధి’ చెలగాటం

- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు
- పని ప్రదేశంలో నీడ, నీళ్లు కరువు
- 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులతోనూ పనులు
- మస్టర్లలో పనులకు రాని వారి పేర్లు.. గిట్టుబాటు కాని కూలి
- ఉపాధి పనుల్లోనూ అధికార ముద్ర
- 10 వారాలుగా అందని బిల్లులు


గుంతకల్లు రూరల్‌ : అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎంపికైన ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి పనుల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాతర వేస్తున్నారు. మండుటెండలో కష్టపడి పనులు చేసే కూలీలు కాసేపు సేద తీరడానికి కాసింత నీడగానీ, గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లుగానీ ఏర్పాటు చేయకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫలితంగా వడదెబ్బకు గురవుతున్న కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఉపశమన చర్యలు తీసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చంటి బిడ్డలను పనులకు తీసుకొస్తున్న కూలీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కనీసం పని ప్రదేశంలో చెట్లు కూడా లేకపోవడంతో తమతోపాటు పిల్లలు కూడా మండుటెండలో మాడిపోతున్నారని తల్లులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.

18 సంవత్సరాలు నిండినవారు మాత్రమే ఉపాధి పనులు చేయడానికి అర్హులనే నిబంధన ఉన్నప్పటికీ 500 మందికి పైగా జాబ్‌కార్డుల్లేని చిన్నారులు పనులకు వస్తున్నారు. నీరు, నీడ లేకుండా మండుటెండలో కఠినతరమైన పనులు చేస్తుండటంతో వృద్ధులు, మహిళలు వారం రోజులకు శక్తి కోల్పోతున్నారు. అందువల్ల వారు పనికా రాలేక మధ్యమధ్యలో తమ పిల్లలను పంపుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి వడదెబ్బ మృతుల సంఖ్య అధికమవుతున్నప్పటికీ చిన్నారులను ఉపాధి పనులకు పంపుతున్నారంటే వారెంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారో అని అధికారులు ఆలోచించడం లేదు.


- ఏరోజుకారోజు మస్టర్లలో కూలీల చేత సంతకాలు చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ వారాంతంలో ఒక్కరోజు మాత్రమే సంతకాలు చేయించుకుంటున్నారు. పనులకు హాజరు కాని వారి పేర్లను సైతం మస్టర్లలో చేర్చి కూలీల నోట్లో మట్టి కొడుతున్నారు. ఫలితంగా రోజుకు రూ.100 కూలి కూడా రావడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు.
- ఉపాధి పనులు తప్ప మరో గత్యంతరం లేని తరుణంలో గ్రామీణులు పూర్తిగా ఈ పనులపైనే ఆధారపడితే నెలల తరబడి కూలి డబ్బులు రావడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారమై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదని వారు వాపోతున్నారు.

అవ్వకు ఆరోగ్యం బాలేదు
మా అవ్వ లక్ష్మీదేవి ఆరోగ్యం బాగోలేక డాక్టర్‌ దగ్గర చూపించుకోవడానికి ఊరికి వెళ్లింది. అందుకే మా అవ్వ బదులు నేనొస్తున్నాను.
- బ్రహ్మేశ్వరి

ఎక్కడా నీడ లేదు
మా పెళ్లయిన 20 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం మా పాప. కుటుంబ పోషణకు వేరే మార్గం లేకపోవడంతో నేను, మా ఆయన ఇద్దరం ఉపాధి పనులపైనే ఆధారపడ్డాం. ఇంటిదగ్గర పాపను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మాతోపాటే పాపను తీసుకొస్తున్నాం. కూర్చోడానికి ఎక్కడా నీడ లేకపోవడంతో పని చేస్తున్నంతసేపూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది.
- రామలక్ష్మి, ఉపాధికూలి, వైటీ.చెరువు

వారం రోజులకు నాలుగొందలా?
పోయినవారమంతా పనిచేస్తే రూ.400 కూలి పడింది. అదైనా ఇస్తారా అంటే అదీ లేదు. పదివారాలుగా కూలి డబ్బులు పెండింగ్‌లో పెట్టారు. ఇలాగైతే ఏం తిని బతకాలి.
- లక్ష్మీదేవి, వైటీ చెరువు.

మరిన్ని వార్తలు