తమ్ముళ్ల కుమ్ములాట

26 Apr, 2017 23:53 IST|Sakshi
తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా అసంతృప్తుల మోత మోగుతోంది. పార్టీ మండల, పట్టణ శాఖ అధ్యక్ష పదవుల కోసం నాయకులు వర్గాలుగా విడిపోయి పోరాటాలకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల ఎన్నికలను వాయిదా వేయడం, లేకపోతే అధిష్టానానికి నివేదించడం చేస్తున్నారు. తాజాగా బుధవారం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల వ్యవహారం నాయకుల అలకలు, ఆందోళనలతో ముగిసింది. పార్టీ పట్టణ శాఖ అధ్యక్ష పదవిని పలువురు ఆశించగా.. ఆశావహులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), ఎంపీ తోట సీతారామలక్ష్మి, పార్టీ సీనియర్‌ నాయకుడు మెంటే పార్థసారథి వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. ఈ పదవి కోసం కాపు, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను రాష్ట్రమంత్రి నారా లోకేష్‌కు వదిలివేయాలని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెరుకూరి రామకృష్ణచౌదరి డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్‌ నేత మెంటే పార్థసారథి సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన వర్గానికి చెందిన తోట భోగయ్య ఆ పదవిని దక్కిం చుకున్నారు. వీరవాసరం మండల శాఖ అధ్యక్ష పదవిని శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన వీరవల్లి రామకృష్ణ డిమాండ్‌ చేశా రు. పరిస్థితి అనుకూలించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. భీమవరం మండల అధ్యక్ష పదవి కాపు వర్గానికి ఇవ్వాలంటూ గందరగోళం సృష్టించారు. మధ్యేమార్గంగా అగ్నికుల క్షత్రియ వర్గానికి అధ్యక్ష పదవి కట్ట బెట్టారు. గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో మండల శాఖ ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల పదవులకు పోటీ ఏర్పడింది. దేవరపల్లిలో మంగళవారం రాత్రి నిర్వహించిన పార్టీ మండల సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సుంకర దుర్గారావు, కొయ్యలమూడి చినబాబు వర్గీయులు బాహాబాహీకి దిగారు. రెండువర్గాల వాగ్వి వాదంతో సమావేశం రసాభాసగా జరిగింది. ఎన్నిక జరపకుండానే సమావేశాన్ని ముగించారు. గోపాలపురం మండలంలో ముగ్గురు, ద్వారకాతిరుమల మండలంలో ముగ్గురు నాయకులు పోటీపడటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. గోపాలపురంలో రహస్య ఓటింగ్‌ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గ టీడీపీ సమావేశాన్ని కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించారు. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 7 మండలాల విస్తృతస్థాయి సమావేశానికి పరిశీలకురాలిగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ తోట సీతారామలక్ష్మి హాజరయ్యారు. ఇక్కడా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కొయ్యలగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాలకు సంబం ధించి అధ్యక్షుల ఎంపికలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. నాయకులు రెండు ప్రధాన సామాజిక వర్గాలుగా విడిపోగా, ఒక వర్గం ఎంపీ అనుకూలురుగా, మరో వర్గం ఎమ్మెల్యే అనుకూలురుగా పైరవీలు చేసుకున్నారు. ముఖ్యంగా కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పారేపల్లి రామారావు ఏఎంసీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండటంతో పార్టీ పదవికి రాజీనామా చేయాలని, మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. ఈ విషయాన్ని అధిష్టానానికి నివేదిస్తామని ప్రకటించిన సీతారామలక్ష్మి సభను ముగించారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనూ సంస్థాగత ఎన్నికలు గ్రూపు రాజకీయాలకు తెరలేపాయి. చాగల్లు మండల, కొవ్వూరు పట్టణ కమిటీల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పదవుల కోసం పట్టుబడుతున్నారు. నాయకులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో రెండుచోట్ల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొవ్వూరు పట్టణ కమిటీ అధ్యక్ష పదవి కోసం రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. రెండు గ్రూపుల నాయకులు పోటాపోటీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేత జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్, మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని, రామా సొసైటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు దాయిన రామకృష్ణ పేరును తెరపైకి తెచ్చారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేదు. పార్టీ పట్టణ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలంటూ బీసీ నాయకులు మంత్రి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. చాగల్లు అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన సమావేశంలో నాయకులు వాగ్వి వాదానికి దిగడంతో ఆరుపులు, కేకలతో రసాభాసగా సాగింది. కొందరు నాయకులు బొడ్డు రాజు పేరును ప్రతిపాదించగా, మరికొందరు చాగల్లు, నెలటూరు గ్రామాలకు చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. మొత్తంగా టీడీపీ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సంస్థాగత ఎన్నికల సందర్భంగా భగ్గుమంటున్నాయి. 
 
మరిన్ని వార్తలు