కాల్పుల కలకలం

21 Aug, 2015 00:49 IST|Sakshi
కాల్పుల కలకలం

► పట్టపగలు జూబ్లీహిల్స్‌లో గుల్బర్గా అంతర్‌రాష్ట్ర ముఠా కాల్పులు
►భారీ దోపిడీకి ఫయీమ్ ముఠా స్కెచ్
►చార్మినార్‌లోని ఓ ప్రముఖ ఆభరణాల షాపు లూటీకి పథకం
►వీలుకాకపోవడంతో మాదాపూర్ షాపింగ్ మాల్స్‌పై కన్ను
►బిగ్‌సీ వద్ద రెక్కీ కోసం వెళ్తుండగా అడ్డగించిన పోలీసులు
►దుండగులు కాల్పులు జరపడంతో ఓ కూలీ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా
►పోలీసులతో కలసి ఫయీమ్‌ను వెంబడించి పట్టుకున్న తోటి కూలీలు
►మొత్తం ముగ్గురు దుండగుల అరెస్టు.. రెండు తుపాకులు, బైక్  స్వాధీనం


 సాక్షి, హైదరాబాద్: గురువారం.. మిట్ట మధ్యాహ్నం.. నగరంలోని జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్.. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కాల్పులు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగుల వెనుక పోలీసుల పరుగు.. వారికి తోడుగా మరో 11 మంది కూలీలు.. అంతా కలసి చివరికి ఆ దుండగులను పట్టేశారు! అక్కడే వారి కోసం ఎదురుచూస్తున్న మరో దొంగ కూడా పోలీసులకు చిక్కాడు. దుండగుల తూటా తగిలి తోటి కూలీ గాయపడడంతో వాహనంలోని మిగతా కూలీలు కిందకు దూకి, ప్రాణాలకు తెగించి దోపిడీ దొంగలను వేటాడి పట్టుకోవడం విశేషం! సినీ ఫక్కీలో జరిగిన ఈ పరిణామాలు రాజధానిలో కలకలం సృష్టించాయి. కాల్పులకు పాల్పడింది కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురి నుంచి రెండు నాటు తుపాకులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
 అసలు ఎవరు వారు..?
 గుల్బర్గాలో నివాసం ఉంటున్న టోలీచౌకి వాసి మీర్జా మహమ్మద్ అబ్దుల్లా(32) అలియాస్ ఫయీమ్ మిర్జా ఈ ముఠాకు నాయకుడు. కరుడుగట్టిన నేరగాడిగా పోలీసు రికార్డుల్లో ఉన్న ఇతడు హైదరాబాద్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. తన సహచరులు మహమ్మద్ సమీయుద్దీన్ (లంగర్‌హౌస్‌వాసి), అబ్దుల్ ఖదీర్(గుల్బర్గావాసి)తో కలిసి ఐదు రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. వీరంతా ఫయీమ్ మిర్జా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటికే మూడు ప్రధాన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన ఈ ముఠా.. చార్మినార్‌లోని ఓ ప్రముఖ ఆభరణాల షాపును లూటీ చేసేందుకు పథకం పన్నారు. అయితే వీలు కాకపోవడంతో మాదాపూర్‌లోని షాపింగ్ మాల్స్‌పై కన్నేశారు. ఇందులో భాగంగా గురువారం బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించేందుకు ఫయీమ్, ఖదీర్ వెళ్లారు.

తర్వాత అక్కడ్నుంచి ద్విచక్రవాహనంపై నీరూస్ జంక్షన్ సమీపంలో తమ కోసం ఎదురుచూస్తున్న సమీయుద్దీన్‌ను కలిసేందుకు బయల్దేరారు. మూడ్రోజుల నుంచే వీరి కదలికలపై నిఘా పెట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఇద్దరేసి సభ్యులుగా నాలుగు బృందాలుగా నాలుగు చోట్ల కాపుగాశారు. హైటెక్‌సిటీ, మాదాపూర్, మాదాపూర్ పోలీసు స్టేషన్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 నీరూస్ షోరూం జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12.00 గంటల నుంచే మాటేశారు. ఈ మార్గం మీదుగానే ఫయీమ్, అబ్దుల్ ఖదీర్‌లు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద తమను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే బైక్ వేగాన్ని పెంచారు. నీరూస్ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినా బైక్ ఆపలేదు. సరిగ్గా జంక్షన్ మధ్యలోకి వెళ్లగానే అప్పటికే నీరూస్ వద్ద వేచి ఉన్న ఇద్దరు పోలీసులు బండిని ఆపారు. తప్పించుకొనే ప్రయత్నం చేస్తూ పోలీసులతో పెనుగులాడారు.

 కాల్పుల కలకలం
 పోలీసులతో పెనుగులాడుతూనే ఫయీమ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడు. పోలీసులు తప్పించుకోవడంతో ఓ బుల్లెట్ అటువైపుగా మెట్రో కార్మికులతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంపై దూసుకెళ్లింది. వాహనంలోని వెనుక వైపు కూర్చున్న ధర్మేందర్ సింగ్(25) ఛాతీలోకి దిగింది. ఈ కార్మికులు మెట్రోరైలు నిర్మాణ పనులను చేసి మధ్యాహ్నం భోజనం కోసం జూబ్లీహిల్స్ నుంచి వస్తున్నారు. కాల్పుల కలకలంతో రోడ్డుపై జనమంతా చెల్లాచెదురయ్యారు. అయితే తమ సహచరుడిని కాల్చాడన్న ఆగ్రహంతో 11 మంది కూలీలు ధైర్యాన్ని ప్రదర్శించారు. వాహనం నుంచి దూకి ఫయీమ్, ఖదీర్‌ను వెంబడించి పట్టుకున్నారు. ఆ వెంటనే అక్కడే వీరి కోసం వేచి చూస్తున్న సమీయుద్దీన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ధర్మేందర్ పొట్టకూటి కోసం మూడు నెలల క్రితం నగరానికి వచ్చి మెట్రో పనులు చేసుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 ఎవరీ ఫయీమ్?
 టోలీచౌకికి చెందిన ఫయిమ్ మిర్జా ఏడేళ్ల క్రితం గుల్బరా్గాకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. 2012లో అక్కడ ఓ హత్య కేసులో నిందితుడు. బెయిల్‌పై వచ్చి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నగరంలో దోపిడీలకు పాల్పడి గుల్బర్గాలో తలదాచుకుంటాడు. అక్కడ కూడా దోపిడీలు చేసి పోలీసులను చిక్కకుండా ఉండేందుకు మకాంను హైదరాబాద్‌కు మార్చుతుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేసి పోలీసులకు దొరికిపోయాడు.

 భారీ దోపిడీకి వ్యూహం: సీపీ మహేందర్‌రెడ్డి
 ఫయీమ్ ముఠా నగరంలో భారీ దోపిడీకి వ్యూహం పన్నిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ‘‘గుల్బర్గా నుంచి వచ్చిన ఆ ముఠా నగరంలో దోపిడీ చేసేందుకు వ్యూహం పన్నినట్లుగా మాకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదు రోజులుగా గ్యాంగ్‌ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు’’ అని ఆయన తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ధర్మేందర్‌ను కమిషనర్ పరామర్శించారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు