‘ప్రథమ’ శిక్షణేది..!

23 Aug, 2016 12:48 IST|Sakshi
  ఆచరణకు నోచుకోని ప్రభుత్వ హామీ
  అనుభవ వైద్యుల్లో నిరాశ
 
బెల్లంపల్లి : జ్వరమొచ్చినా.. జలుబు చేసినా.. కడుపు నొప్పయినా.. మరే రోగమైనా సరే పేదలు, గ్రామీణులు ముందుగా అనుభవ వైద్యుల(ఆర్‌ఎంపీ, పీఎంపీ)నే సంప్రదిస్తుంటారు. ఈ క్రమంలో ప్రథమ చికిత్సపై అనుభవ వైద్యులకు శిక్షణ అందించి రోగుల ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో చేపట్టిన శిక్షణ కార్యక్రమం అటకెక్కింది. ఏళ్లు గడుస్తున్నా శిక్షణ ఇప్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ హామీ ఆచరణలో అమలుకు నోచుకోకపోవడం.. ఎప్పటికప్పుడు దాటవేస్తుండడంపై  వైద్యుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి అనుభవ వైద్యుల(ఆర్‌ఎంపీ, పీఎంపీ)కు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ ఇప్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ఆ మేరకు 2009 అక్టోబర్ 1న జిల్లాలోని అనుభవ వైద్యులకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఒక్కో మండలం నుంచి ఇద్దరు చొప్పున బ్యాచ్‌కు గరిష్టంగా 52 మందితో శిక్షణ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ), హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(హెచ్‌ఎంఆర్‌ఐ), డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(పారామెడికల్  బోర్డు) సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణకు నిర్ణరుుంచారు.
 
తొలి విడతగా జిల్లాలోని 2,027 మంది అనుభవ వైద్యులను శిక్షణకు ఎంపిక చేశారు. మరో 2 వేల మందికిపైగా మలి విడతలో శిక్షణ ఇవ్వాలని భావించారు. మొత్తంగా జిల్లాలోని సుమారు ఐదు వేల మందికి శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలనేది ప్రణాళిక. శిక్షణ కాలం మూడు నెలలుగా నిర్దేశించి తొలి బ్యాచ్‌కు పారామెడిక్స్ శిక్షణ దిగ్విజయంగా ముగించారు. వీరికి అర్హత పరీక్షలు నిర్విహ ంచి, మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చే క్రమంలోనే అనూహ్యంగా వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించారు. దీంతో అనుభవ వైద్యుల శిక్షణకు 2011లో బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనుభవ వైద్యుల శిక్షణపై పట్టించుకునే వారే కరువయ్యారు.
 
శిక్షణ ఎందుకంటే.. 
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గల్లీకొకరు చొప్పున అనుభవ వైద్యులు పని చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వీరి ద్వారా రోగులకు ప్రాథమిక వైద్యం అందుతోంది. జ్వరం, జలుబు, కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలపై అనుభవ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. సరైన అవగాహన లేక, తెలిసీ తెలియని వైద్యం చేయడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉంటాయి(ఆ తీరుగా చికిత్స చేయడం వల్ల కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి). ప్రథమ చికిత్స అందించడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదముంది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో రోగికి అత్యవసర చికిత్స చేసి, వెంటనే ప్రధాన ఆస్పత్రికి రెఫర్ చేసి ప్రాణాలు కాపాడడంలో తోడ్పడతారనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వం సంకల్పించింది.
 
ప్రాథమిక అంశాల్లో..
అనుభవ వైద్యులకు వైద్యరంగంలోని ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. పాముకాటు, తేలుకాటు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గుండె సంబంధిత వ్యాధులకు అత్యవసరంగా ప్రథమ చికిత్స చేయడం వంటి అంశాల్లో ప్రయోగాత్మకంగా, థియరీతో సహా శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ వల్ల అనుభవ వైద్యులకు ప్రథమ చికిత్స చేసే తీరుపై, రోగి ప్రాణాలు కాపాడడంలో అవగాహన ఏర్పడింది.  
 
ఆశలు రేపి.. 
అనుభవ వైద్యులకు కమ్యూనిటీ పారామెడిక్స్‌లో శిక్షణ ఇప్పించి సేవలను వినియోగించుకుంటామని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఆ అంశాన్ని ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చింది. శిక్షణ కోసం రూ.33 లక్షలు మంజూరు చేసినట్లు సమాచారం. కాని ఇంత వరకు అనుభవ వైద్యులకు రాష్ట్రంలో ఎక్కడా శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు శిక్షణ ప్రారంభిస్తారో కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం అనుభవ వైద్యులు ఎదురుచూస్తున్నారు. రెండు నెలల క్రితం సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో అనుభవ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి శిక్షణ కోసం విన్నవించగా సానుకూలంగా స్పందించారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేకుండా పోయింది. 
 
శిక్షణ ఇవ్వడం ఆలస్యమవుతోంది..
అనుభవ వైద్యులకు శిక్షణ ఇస్తారనే ఆశతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా శిక్షణ ఇస్తామని ప్రకటించడం మాలో ఆశలు రేపింది. ఇప్పటికే తీవ్ర ఆలస్యమైంది. మరే మాత్రం జాప్యం చేయకుండా శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్లు అందజేయాలి. 
 - జి.శంకరయ్య, టీఎస్ అనుభవ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
 
సానుకూలంగా స్పందించాలి
శిక్షణ ఇప్పించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఇన్నాళ్లుగా మాకంటూ గుర్తింపు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాం. శిక్షణ ఇస్తే మాకు మరింత భరోసా కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోవాలి. 
 - బత్తుల రవి, టీఎస్ అనుభవ వైద్యుల సంఘం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు
మరిన్ని వార్తలు