వీరేంద్ర హత్య కేసులో ఐదుగురి అరెస్టు

9 Jun, 2017 23:19 IST|Sakshi
వీరేంద్ర హత్య కేసులో ఐదుగురి అరెస్టు
మరోకరి కోసం గాలింపు
కాకినాడ రూరల్‌ : ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన దొమ్మ వీరేంద్రకు హత్య కేసులో శుక్రవారం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్‌ సీఐ వి.పవన్‌కిశోర్, ఎస్సై డి.రామారావు వివరాలను వెల్లడించారు. ఇంద్రపాలెం గొల్లపేటకు చెందిన భీమాల రమణ (సున్నంబట్టి రమణ) అదేగ్రామం శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న ముద్దాడ లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇంద్రపాలెం అర్జున్‌నగర్‌కు చెందిన మాంసం వ్యాపారి దొమ్మ వీరేంద్ర కొంత కాలంగా తన కోర్కె తీర్చాలని, లేదంటే యాసిడ్‌ పోస్తానని లక్ష్మిని బెదిరించసాగాడు. రమణ లేని సమయంలో లక్ష్మి ఇంటికి వెళ్లి ఆమె తమ్ముళ్లను కొట్టి వేధిస్తుండేవాడు. దీంతో వీరేంద్రను హతమార్చాలని భావించి లక్ష్మి రమణకు, అతని స్నేహితులు చీడిగకు చెందిన అనసూరి బాబూప్రసాద్, కాకినాడ పాత బస్‌స్టాండ్‌ వెంకటేశ్వరకాలనీకి చెందిన దంగేటి జగదీష్‌కు విషయాన్ని చెప్పింది. అదును కోసం ఎదురు చూస్తున్న రమణ తన స్నేహితులతో తీసుకున్న గ్రూప్‌ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయగా, అది చూసిన వీరేంద్ర మేనల్లుడు ఆరి సింహాచలం ఛీ అని కామెంట్‌ పెట్టాడు. దీన్ని సాకుగా తీసుకుని సింహాచలం నుంచి ఫోన్‌ లాక్కొని రమణ స్నేహితులు వెళ్లిపోయారు. మేనల్లుడు ఫోన్‌ కోసం వెళ్లిన వీరేంద్రను రమణ, అతని స్నేహితులు అనసూరి బాబూప్రసాద్, దంగేటి జగదీష్, ముద్దాడ లక్ష్మి, ఆమె తమ్ముళ్లు పితాని ఎర్రయ్య, బుల్లియ్య గొడ్డలి, కత్తి, క్రికెట్‌ స్టంపులతో దాడి చేసి చంపి పారిపోయారని సీఐ పవన్‌కిశోర్‌ వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున బెయిల్‌ కోసం లాయర్‌ను కలిసేందుకు సొమ్ములు సిద్ధం చేసుకోవడానికి సమావేశమైనట్లు తమకు వచ్చిన సమాచారం దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ముద్దాయిల్లో ఒకడైన ముద్దాడ లక్ష్మి చినతమ్ముడు బుల్లియ్య పరారయ్యాడని సీఐ పవన్‌కిశోర్‌ తెలిపారు. అనంతరం వారి నుంచి వీరేంద్రను చంపడానికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, క్రికెట్‌ స్టంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి ఐదుగురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు వివరించారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డిఎస్‌పీ వెంకటేశ్వరరావు, సిఐ పవన్‌కిశోర్‌లు అభినందించారు.
మరిన్ని వార్తలు