పొంగి పొర్లుతున్న ‘నిర్లక్ష్యం’

28 Sep, 2016 18:50 IST|Sakshi
పొంగి పొర్లుతున్న ‘నిర్లక్ష్యం’
* ఆరు దశాబ్దాలుగా పంట నష్టం
వచ్చి చూసి వెళ్లేవారే తప్ప చర్యలు శూన్యం
నల్లమడ శాశ్వత ముంపు నివారణ చర్యలకు వెనకడుగు
మాటలతో కాలం గడుపుతున్న ప్రభుత్వం
 
పెదనందిపాడు/ చిలకలూరిపేట టౌన్‌: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నల్లమడ వాగు కింద సుమారు 3లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతోంది. గుంటూరు జిల్లాలో చిలకలూరి పేట, ప్రత్తిపాడు, పొన్నూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో పర్చూరు, చీరాల నియోజవర్గాల రైతులు ఈ వాగుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఆరు నియోజకవర్గాల్లో ఈ వాగుపై చాలా చోట్ల కొన్ని వందల  కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకాల వలన రైతులకు ఉపయోగం ఉన్నా, వరదలు వచ్చిన ప్రతిసారీ రైతులు నష్టపోతూనే ఉన్నారు. పాలకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. వాగుకు పడిన గండ్లను పటిష్టంగా పూడ్చకపోవడం వలన పడిన చోటే మళ్లీ మళ్లీ గండ్లు పడుతున్నాయి. 2013లో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నల్లమడ వాగును శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపడతామని ప్రకటించారు. తీరా గెలిచిన తర్వాత నల్లమడ వాగు గురించి మరిచి పోయారు. 
 
60 ఏళ్లలో 8 కమిటీలు..
నల్లమడ వాగుకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈ 60 ఏళ్లలో 8 కమిటీలు సూచనలు చేశాయి. ఏ ఒక్క సూచన అమలు చేసిన దాఖలాలు లేవని నల్లమడ రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. 1964లో మిత్రా కమిటీ,1980లో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, 1982లో శాసనసభ అంచనాల కమిటీ, 1987లో డాక్టర్‌ శ్రీరామకృష్ణయ్య కమిటీ, 1991లో టెక్నికల్‌ మానిటరింగ్‌ కమిటీ, 1998లో సీహెచ్‌ రాధాకృష్ణమూర్తి కమిటీ, 2000లో ఎ.కృష్ణారావు కమిటీ, 2005లో చీఫ్‌ ఇంజినీర్‌ రోశయ్య కమిటీ ఈ ప్రాంతానికి వచ్చి నల్లమడ వాగును పరిశీలించాయి. వాగును 300 సి వాల్యూగా మార్చి, నల్లమడ వాగుకు శాశ్వత ముంపు  నివారణ చర్యలు చేపట్టాలని సూచించాయి. నల్లమడ వాగు  శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని నల్లమడ రైతు సంఘం ఆధ్యక్షుడు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు  నాయత్వంలో అనేక సంవత్సరాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.211 కోట్లతో నల్లమడ వాగును శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. కానీ నేటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. రైతులకు కష్టాలు తప్పడం లేదు. నల్లమడ వాగును అభివృధ్ధి చేసి  ముంపు బారిన పడకుండా శాశ్వత నివారణ చర్యలు చేపడితే ఆరు నియోజకవర్గాలు సస్యశ్యామలంగా మారతాయి. 
 
శాశ్వత ముంపు చర్యలు వెంటనే చేపట్టాలి..
నల్లమడ వాగును అభివృద్ధి చేసి, శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలి.  ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నల్లమడ వాగు శాశ్వత ముంపు నివారణ చర్యలకు గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వెంటనే  అమలు చేయాలి. రైతులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంలోని మర్మం ఆయనకే తెలియాలి. వాగులకు కరకట్టలు వేసినపుడు రైతులు కోల్పోయే భూమికి తగిన పరిహారం చెల్లిస్తే రైతులు మాత్రం ఎందుకు సహకరించరు. 
–  డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు, నల్లమడ రైతు సంఘం ఆధ్యక్షుడు
 
రైతుల సమస్యలు పట్టని ప్రజా ప్రతినిధులు..
ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఆధికారులు పట్టించుకోకపోడం వలన నల్లమడ శాశ్వత ముంపు నివారణకు ప్రతిపాదనలు తయారైనా అవి ముందుకు సాగడం లేదు.ఇకనైనా ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి నల్లమడ శాశ్వత ముంపు నివారణ చర్యలు అమలయ్యేలా చూడాలి. 
– యార్లగడ్డ అంకమ్మ చౌదరి, నల్లమడ రైతు సంఘం కార్యదర్శి
 
 
రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే అందజేయాలి..
ప్రస్తుతం వచ్చిన వరదల వలన పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం స్పందించి  వెంటనే నష్టపరిహారం అందజేయాలి. నల్లమడ వాగుకు పడిన గండ్లను వెంటనే పటిష్టంగా పూడ్చాలి.
– బెల్లం సీతారామయ్య, రైతు

 

మరిన్ని వార్తలు