పోలీసుల వలలో బెట్టింగ్‌ రాయుళ్లు

13 Jun, 2017 22:02 IST|Sakshi
పోలీసుల వలలో బెట్టింగ్‌ రాయుళ్లు

తాడిపత్రి టౌన్‌ : క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లు పోలీసుల వలకు చిక్కారు. రోజుకో ప్రాంతంలో బెట్టింగ్‌ నిర్వహిస్తూ సవాల్‌గా నిలిచిన వీరిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో గల ఎస్‌బీఎం ఫంక‌్షన్‌ హాలు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించగా తొమ్మిది మంది పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.24 లక్షలు నగదు, 12 సెల్‌ఫోన్లు, ఒక ప్రింటర్, టీవీ, రెండు ల్యాబ్‌ట్యాబ్లు, ఒక కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.   శ్రీలంక-పాకిస్తాన్‌ మధ్య జరిగే క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో వీరు బెట్టింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు.

ఎక్కడెక్కడి నుంచో వచ్చి...
తాడిపత్రిలో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతూ పట్టుబడిన వారిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారున్నారు. వారిలో అనంతపురం, హిందూపురం, తాడిపత్రి సహా బెంగళూరు నుంచి కూడా ఉన్నారన్నారు. వీరి ఆటలను కట్టడి చేసిన పట్టణ, రూరల్‌, ముదిగుబ్బ ఎస్‌ఐలు ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, మగ్బుల్‌బాషా, ఏఎస్‌ఐలు రామచంద్రారెడ్డి, రాజశేఖర్, కానిస్టేబుళ్లు ప్రవీణ్, శ్రీనివాసులును డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు